ఇంతకీ జనసేనలో ఏం జరుగుతోంది! | Jana sena Leaders Disappointed With Pawan Kalyan Decisions | Sakshi
Sakshi News home page

ఇంతకీ జనసేనలో ఏం జరుగుతోంది!

Published Sat, Aug 3 2019 12:25 PM | Last Updated on Sat, Aug 3 2019 1:48 PM

Jana sena Leaders Disappointed With Pawan Kalyan Decisions - Sakshi

ఎన్నికల ముందు అసమ్మతి స్వరాలు. ఎన్నికల తర్వాత అంతకన్నా ఎక్కువ శృతిలో బీభత్సమైన విమర్శలు. ఒక పక్క దారుణమైన ఓటమి. రెండుచోట్ల పోటీ చేసినా ఫలితం లేదు. ఇంత జరిగిన తర్వాత అక్కడ ఏం జరుగుతోంది? అంతర్మథనం జరగలేదా? మేధోమథనం పనికిరావడం లేదా?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నారని ప్రజలు అనుకున్నారో.. లేక ఆయన చెప్పినదాంట్లో అర్థంపర్థం లేదని భావించారో మొత్తం మీద ఓ రేంజ్‌లో తీర్పునిచ్చారు. ఆయన రెండుచోట్ల పోటీ చేసినా గెలవలేకపోయారు. చివరాఖరికి ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది జనసేన పార్టీ. ఇంత పెద్ద ఓటమి నుంచి కోలుకోవాలంటే అంత తొందరగా సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే పవన్‌ చాలాకాలం నిశ్శబ్దంగా ఉండిపోయారు. రెండు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే ఓటమి బాధనుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు.. 

గత కొన్ని రోజులుగా జనసేనపార్టీ శ్రేణులకు ఆయన అందుబాటులోకి వస్తున్నారు. పార్టీ నాయకులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడుగా పవన్ కల్యాణ్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతల్లో చాలామందికి రుచించడం లేదని సమాచారం. అంతేకాదు వారిలో కొందరు పవన్ కళ్యాణ్ తీరును బాహటంగానే విమర్శిస్తున్నారు. మరికొంతమంది నేతలైతే ఇక ఈయన మారేలా లేరని తమ దారి తాము చూసుకుంటున్నారు. అసెంబ్లీ సెగ్మంట్లవారీగా పేరున్న నేతలు పలువురు పక్క చూపులు చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో  పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ సెగ్మంట్‌ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన పసుపులేటి రామారావు.. పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ రాజీనామా చేయడం గోదావరి జిల్లాల్లో కలకలం రేపుతోంది. పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా అధ్యక్షుని తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తన చుట్టూ ఒక కోటరీని తయారు చేసుకొని పవన్‌ పార్టీ వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్‌ను కలవాలంటే అంత ఈజీ కాదని ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసినవారే ఆవేదన చెందుతున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించకోవచ్చు. పవన్ దర్శనం కావాలంటే ముందు కోటరీ నేతలను ప్రసన్నం చేసుకోవాల్సి వస్తోందని, వారికి డబ్బుయావ తప్ప మరొకటి లేదని పార్టీని విడిచిపెడుతున్న వారు పబ్లిగ్గానే ధ్వజమెత్తుతున్నారు. ఈ మధ్య పవన్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో చాలాచోట్ల నేతలు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తణుకు నుంచి జనసేన పార్టీ  రెబెల్ గా పోటీ చేసిన రామచంద్రరావు అనే వ్యక్తిని ఈ మధ్యనే ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారిని ఎలా ప్రోత్సహిస్తారంటూ రాజీనామా చేసిన పసుపులేటి రామారావు ఫైరవుతున్నారు. 

సాధారణంగా ఎన్నికల్లో ఓడిన పార్టీ ఏం చేస్తుంది? నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసుకొని.. తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఈ విషయంలో పవన్‌ కల్యాణ్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న కమిటీలపట్ల సీనియర్‌ నేతలు సైతం అసంతృప్తిలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలనుంచి అందుతున్న సమాచారం. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌ను నియమించడం ఆ పార్టీలోని పలువురు నేతలకు రుచించడం లేదట. ఎప్పటినుంచో ఉన్న నేతలను కాదని, ఎన్నికలకు ముందు వచ్చిన నాదెండ్ల మనోహర్‌ను ఎలా నియమిస్తారంటూ వారు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. 

మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు వినూత్నంగా, ఆచరణీయంగా, ఆలోచనాత్మకంగా ఉంటాయని జనసేన కార్యకర్తలు, అభిమానులు భావించారు. ఆ దిశగా అడుగులు పడకపోగా.. మరింత నష్టం కలిగించేవిధంగా పవన్‌ వ్యవహరిస్తున్నారని అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పలువురు బలమైన నేతలు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లడానికి పవన్‌ వైఖరియే కారణమని చెప్పుకుంటున్నారు. అద్దెపల్లి శ్రీధర్‌, ఆర్టీఐ మాజీ కమిషనర్‌ విజయబాబు, కోశాధికారిగా సేవలందించిన రాఘవయ్య జనసేనను వీడడం దీనికి నిదర్శనమని అంటున్నారు. ఇప్పటికైనా పవన్‌ కల్యాణ్‌ మేలుకొని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, లేదంటే పార్టీ మరింత పాతాళంలోకి పడిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement