
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాటం ప్రారంభిస్తున్నానని, ఇందులోభాగంగా ఈ నెల 20వ తేదీన ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్ర చేపడుతున్నానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. గంగపూజ నిర్వహించి యాత్ర మొదలుపెడతామని, జై ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పిస్తామని చెప్పారు. మొత్తం 17రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తన పర్యటన ఉంటుందని చెప్పారు. బస్సుయాత్రలో భాగంగా ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ప్రతి నియోజకవర్గంలో యువత, విద్యార్థులతో కవాతు నిర్వహిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో లక్షమందితో ఈ కవాతు ఉంటుందని పవన్ తెలిపారు. విశాఖపట్నంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న సమస్యలేమిటో తెలుసుకోవడానికి యాత్ర చేపడుతున్నామని తెలిపారు. కొంతమంది పాలకుల నిర్లక్ష్యానికి కోట్లాదిమంది ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రత్యక హోదాతోపాటు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని అమలుచేయలేదని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు ఇలాగే వెనుకబడి ఉంటే.. ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేగుతాయని తెలిపారు. జనసేన పార్టీ మ్యానిఫెస్టో కమిటీ కూడా బస్సుయాత్రలో పాల్గొంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment