
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉనావ్ రేప్ బాధితురాలికి న్యాయం చేయాలంటూ పార్లమెంటు ఆవరణలో మంగళవారం జరిగిన నిరసన ప్రదర్శనలో జయా బచ్చన్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నిరసన ప్రదర్శనలో ఆమె నవ్వులు చిందిస్తూ.. సరదాగా తోటి ఎంపీలతో మాట్లాడుతూ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చావుబతుకుల మధ్య ఉన్న ఉనావ్ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో జయాబచ్చన్‌తోపాటు, ఎస్పీ సీనియర్ ఎంపీ రాంగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ తోటి ఎంపీలతో సరదాగా ముచ్చటిస్తూ..నవ్వులు చిందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో జయా బచ్చన్ ఇలా వ్యవహరించడం సముచితం కాదని నెటిజన్లు అంటున్నారు. ఎంపీల నవ్వుల్లోనే వారి నిబద్ధత, చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతుందని తప్పుబడుతున్నారు. నెలకు జీతం, ప్రభుత్వ సౌకర్యాలు అందితే చాలు.. ప్రజలు ఏమైతే ఏంటి అన్నట్టుగా ఎంపీల తీరు ఉందని, ఇది సిగ్గుచేటు అని నెటిజన్లు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment