లక్నో : తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు.. ఒకప్పటి తన స్నేహితుడు, ప్రస్తుత ప్రత్యర్థి ఆజంఖాన్‌పై సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, మహిళల రక్షణ కోసం ఆజంఖాన్‌ను ఎన్నికల్లో పోటీచేయనివ్వద్దన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చచ్చిపోతే.. నీవు సంతృప్తి పడతావా?’ అంటూ ఆజంఖాన్ ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘నన్ను భయపడితే రాంపూర్ వదిలి వెళ్తానని అనుకుంటున్నావ్.. కానీ ఎన్ని చేసినా నేను ఇక్కడి నుంచి వెళ్లే ముచ్చటే లేదు. ఇలాంటి వ్యక్తిని ఎన్నికల్లో అనుమతించకూడదు. ఒక వేళ ఇతను గెలిస్తే ప్రజాస్వామ్యం ఏమవుతోంది. మహిళల పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించారు.
ఇక 2004లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జయప్రద ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో ఆమె విజయానికి ఆజంఖాన్ కృష్టి చేశారు. అనంతరం వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె పార్టీని వీడారు. ఇటీవల బీజేపీలో చేరిన జయప్రద ప్రస్తుతం ఆ పార్టీ తరఫున రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా ఆజంఖాన్ బరిలోకి దిగారు. దీంతో వీరి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది.
ఆదివారం ఓ ఎన్నికల ప్రచారసభలో ఆజంఖాన్ మాట్లాడుతూ.. ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తీసుకొచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా, పల్లెత్తు మాట అనకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే(మీడియా) సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను.’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మహిళల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆజంఖాన్‌పై కేసు కూడా నమోదైంది. మహిళా కమిషన్ సైతం ఆజం ఖాన్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి అతనికి నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది. (జయప్రదపై ఆజం దిగజారుడు వ్యాఖ్య)
Comments
Please login to add a commentAdd a comment