
సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆస్పత్రిలో అందిన వైద్య చికిత్సపై తమిళనాడు మంత్రులు తలో వాదన వినిపిస్తూ ప్రజలను కంగు తినిపిస్తున్నారు. పొంతనలేని వ్యాఖ్యలతో అయోమయానికి గురి చేస్తున్నారు. ‘అమ్మ’ మృతిపై అనుమానాల నివృత్తి కోసం రిటైర్ట్ జడ్జి అర్ముగస్వామి నేత్వత్వంలో తమిళనాడు ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. జయలలిత కోలుకుంటున్నట్లుగా అపోలో ఆస్పత్రి వద్ద తనతోపాటు ఇతర మంత్రులు, పార్టీ ప్రముఖులు చెప్పిందంతా అబద్ధమని, శశికళకు భయపడే అలా చెప్పామని మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ ఇటీవల బహిరంగంగా ప్రకటించి కలకలం రేపారు.
మరోవైపు జయను తామంతా నేరుగా చూశామని మంత్రి సెల్లూరు రాజా మంగళవారం పేర్కొన్నారు. అయితే ఆమెను ఎవరూ చూడలేదని, శశికళకు భయపడి చూసినట్లుగా చెప్పామని మంత్రి కేసీ వీరమణి షోళింగనల్లూరు బహిరంగ సభలో చెప్పారు. మంత్రి వెల్లమండి నటరాజన్ సైతం జయను చూడలేదని తాజాగా తెలిపారు. ఇక జయలలిత ద్రాక్ష తింటుండగా తాను చూశానని ఆమె మేనల్లుడు దీపక్ చెప్పటం గమనార్హం. ఈ నేపథ్యంలో కమిషన్ విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయని మంత్రులు జయకుమార్, ఉదయకుమార్ తెలిపారు.