సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ తుమ్మిడిహెట్టి పర్యటన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందనే వినోద్‌కుమార్ ఆరోపణలు సరికాదని ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పార్టీ నాయకుడిగా కాకుండా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే.. మేడిగడ్డ వద్ద నీటి లభ్యత లేదని బయటపడుతుందనే భయంతో కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీవన్‌రెడ్డి గురువారం గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా...తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తే గ్రావిటీ ద్వారా మైలారం వరకు నీటిని తరలించవచ్చని తెలిపారు. తద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు. మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోతలకు మొగ్గు చూపకుండా.. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం టూరిజం స్పాట్ అయిపోయింది..
కాళేశ్వరం ప్రాజెక్ట్ సాగునీటి ప్రాజెక్ట్ అనడం కంటే.. టూరిజం స్పాట్ అంటే బాగుంటుందేమోనని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం వద్దకు వెళ్ళే ఐఏఎస్ అధికారులు.. తుమ్మిడిహెట్టిని కూడా సందర్శించాలని సూచించారు. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఐఏఎస్ అధికారులపైన ఉందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగిందని వినోద్ అబద్దాలు చెప్పడం సరికాదన్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా అడగలేదని లోక్ సభలో కేంద్ర జలవనరుల మంత్రి స్వయంగా చెప్పారు. కేంద్ర మంత్రి చెప్పింది అబద్ధమైతే.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇవ్వడం లేదు. ఇంకా ఎన్నిరోజులు రాష్ట్ర ప్రజలను మభ్యపెడతారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం డీపీఆర్‌లు కేంద్రానికి ఇవ్వలేదనేది నిజం. డీపీఆర్లు కేంద్రానికి ఇస్తే.. కమీషన్ల బాగోతం బయట పడుతుందనే భయం ప్రభుత్వ పెద్దలలో ఉంది. కమీషన్ల కోసమే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. తక్షణం ఈ నామినేషన్ ప్రక్రియను నిలిపివేయాలి. మూడో టీఎంసీ నీటిని ఎత్తి పోసేందుకు నామినేషన్ ద్వారా పనులు కట్టబెట్టడం సరికాదు.. గ్లోబల్ టెండర్ పిలవాల్సిందే అని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment