
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్‌లో కవితకు ఎలా గుణపాఠం చెప్పారో హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి అలాగే గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ అన్నారు. ‘హుజూర్‌నగర్‌లో అవినీతిని ఓడిద్దాం... కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం’ అని పిలుపునిచ్చారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అందించే రైతుబంధు సహాయం పూర్తిగా రైతులకు అందలేదని, యూరియా కొరతను అధిగమించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో సర్పంచ్‌లకు అధికారాలు, నిధులు లేవని మండిపడ్డారు. ఓ గిరిజన సర్పంచ్ తన బాధలను లేఖ ద్వారా బహిర్గతం చేయడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నేతల జేబులు నిండే పథకాలకు నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ చెప్తోన్న సర్వేలన్నీ బూటకమని కొట్టిపారేశారు.
హుజూర్‌నగర్ కాంగ్రెస్ కంచుకోట
ప్రజాసమస్యలపై పోరాడిన ఉత్తమ్ పద్మావతి కావాలో, అవినీతి పరుడు, మంత్రి జగదీష్ రెడ్డి బినామీ సైదిరెడ్డి కావాలో హుజూర్‌నగర్ ప్రజలు నిర్ణయించుకోవాలని కుసుమ కుమార్ విఙ్ఞప్తి చేశారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి, జానారెడ్డిలు సైతం ప్రచారానికి వస్తారని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో అడుగు పెడుతుంది అని పేర్కొన్నారు. అధికార పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ‘కారు.. సారు.. పదహారు’ నినాదంతో ముందుకు వెళ్లినా చివరికి మిగిలింది తొమ్మిదే అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Comments
Please login to add a commentAdd a comment