
అమిత్ షా, నరేంద్ర మోదీ (ఫైల్)
ముంబై: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు అని ఎన్సీపీ, శివసేన వ్యాఖ్యానించాయి. బీజేపీపై ప్రజలకు రోజురోజుకు నమ్మకం తగ్గిపోతోందని పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు జార్ఖండ్ ప్రజలు గర్వభంగం చేశారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. ‘మోదీ, అమిత్‌షాల గర్వాన్ని జార్ఖండ్ ప్రజలు తుడిచిపెట్టేశారు. ప్రజాస్వామ్యం గెలిచింద’ని ఆయన ట్వీట్ చేశారు.
నవాబ్ మాలిక్, మనీష కయాండే (ఫైల్ ఫొటోలు)
మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైన బీజేపీపై ప్రజలకు విశ్వాసం సడలుతోందని శివసేన అధికార ప్రతినిధి మనీష కయాండే అభిప్రాయపడ్డారు. ‘వారు (బీజేపీ) అభివృద్ధి రాజకీయాలు మాత్రమే చేస్తామని ప్రజలతో చెప్పారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నార్సీ వంటి అంశాలను అందుకే తెర ముందుకు తీసుకొచ్చార’ని మనీష పేర్కొన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా బాగానే కష్టపడినప్పటికీ.. జార్ఖండ్‌లో బీజేపీ అధికారాన్ని కోల్పోయిందని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు.
జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో తాజా ట్రెండ్స్ ప్రకారం జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి 46 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 24 స్థానాలతో బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. ఏజేఎస్‌యూ 4, జేవీఎం 3 స్ధానాల్లో, ఇతరులు 4 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సివుంది. (చదవండి: జార్ఖండ్ పీఠం మాదే..)
Comments
Please login to add a commentAdd a comment