
భోపాల్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియా మరోసారి వార్తల్లోకెక్కారు. తన ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్ పార్టీ పేరు తీసేసి ప్రజాసేవకుడు, క్రికెట్ ప్రేమికుడు అని పెట్టుకోవడం రాజకీయంగా కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కీ, జ్యోతిరాదిత్యకి మధ్య విభేదాలు ఉన్నాయని, త్వరలోనే ఆయన పార్టీ వీడతారంటూ పలు ఊహాగానాలు చెలరేగాయి. అయితే జ్యోతిరాదిత్య మాత్రం అదేమీ లేదంటూ కొట్టి పారేశారు.
అతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా భూతద్దంలో పెట్టి చూస్తుందని మండి పడ్డారు. నెలరోజుల క్రితమే తాను ట్విట్టర్ అకౌంట్‌లో ప్రొఫైల్ మార్చానని,కాంగ్రెస్ పార్టీతో తాను తెగతెంపులు చేసుకున్నట్టు వస్తున్న వార్తలన్నీ నిరాధారమని ట్వీట్ చేశారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎంతో కృషి చేసిన జ్యోతిరాదిత్య సింధియా సీఎం పదవిని ఆశించి భంగపడ్డారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్, మరో కీలక నేత దిగ్విజయ్‌సింగ్‌లకు ప్రాధాన్యం ఇచ్చి తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనలో జ్యోతిరాదిత్య ఉన్నట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.