సాక్షి, హైదరాబాద్ : 2014 ఎన్నికల్లో అయిదు లక్షల ఓట్లతో అధికారం చేజారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ‘కడప పార్లమెంట్‌వాసుల ఆత్మీయ’ సమావేశానికి ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పార్టీని సమర్థవంతంగా నడిపిన ఘనత వైఎస్ జగన్‌దేనని అన్నారు. అడ్డదారులు తప్ప రహదారి తెలియని వ్యక్తి చంద్రబాబు నాయుడని విమర్శించారు.
ఓటుకు రూ.5వేలు నుంచి రూ.10వేలు ఖర్చు చేసేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారని సజ్జల ఆరోపించారు. ఓ వైపు దొంగ ఓట్లు ఎలా వేయించాలా అని కుట్ర పన్నుతున్న ఆయన, మరోవైపు వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు చర్యలకు దిగారని విమర్శించారు. ఓటర్లను ప్రలోభపెట్టి గట్టెక్కాలని చంద్రబాబు చూస్తున్నారని సజ్జల మండిపడ్డారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రాష్ట్ర ప‍్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ సమయంలో అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని సజ్జల కోరారు. నగరంలో స్థిరపడ్డ వైఎస్సార్ అభిమానులు, మేధావులు, విద్యావంతులు తమ నియోజకవర్గాలకు వెళ్లి ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చూడాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment