సాక్షి, వరంగల్ : మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓ రాజకీయ బఫూన్ అని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. మీడియా లగడపాటికి అనవసర ప్రచారం కల్పిస్తోందని మండిపడ్డారు. బుధవారం హన్మకొండ టీఆర్‌ఎస్ అర్భన్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మహాకూటమి తెలంగాణ వ్యతిరేకుల కూటమని అన్నారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఓడిపోతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. కేసీఆర్‌ను ఎదుర్కునే నాయకుడు కూటమిలో లేరని చెప్పారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో జతకట్టడం కాంగ్రెస్ చారిత్రక తప్పిదంగా పేర్కొన్నారు.
కోదండరాం ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నాడన్నారు. ఎన్నికల అనంతరం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ గాలి వీస్తోందని, అది డిసెంబర్ 7న తుఫానుగా మారుతుందన్నారు. వరంగల్ జిల్లాలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక లక్ష ఎకరాలకు నీరు అందించటమే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పనకు దోహదపడతామని, చరిత్ర కలిగిన వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయటానికి కృషి చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment