కమల్ హాసన్
చెన్నై: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీ్టలతో జట్టు కట్టాలని సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ నిర్ణయించింది. భావ సారూప్యాలున్న పార్టీని వెతికి, పొత్తు కుదుర్చుకునే బాధ్యతను పార్టీ అధినేత కమల్ హాసన్‌కే అప్పగించింది. శనివారం చెన్నైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్, పాలనా కమిటీల చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన తరువాత కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ..రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. కూటమి కోసం తాము చేస్తున్న యత్నాలు ఫలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించగా..ఇప్పుడే వివరాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పొత్తు కుదుర్చుకునే పార్టీ సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నా, ఆలోచనా విధానం తమిళనాడుకు అనుకూలంగా ఉండాలన్నారు. రాష్ట్ర అభివృద్ధే అజెండాగా లోక్‌సభ బరిలో దిగుతామని చెప్పారు. తమిళనాడు డీఎన్‌ఏను మార్చే పార్టీతో కలసి పనిచేయమని తెలపడం ద్వారా బీజేపీతో పొత్తు ఉండదని పరోక్షంగా చెప్పారు. కాంగ్రెస్‌తో సంబంధాలు తెంచుకుంటే, డీఎంకేతో పొత్తుకు సిద్ధమేనని కమల్ ప్రకటించగా డీఎంకే తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment