
పెదవాల్తేరు(విశాఖతూర్పు)/సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): కేంద్రప్రభుత్వం పలు పథకాల కింద రాష్ట్రానికి ఇస్తున్న నిధులు జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు దిగమింగుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం రాష్ట్రానికి పలు కేంద్రీయ సంస్థలు, రైల్వే ప్రాజెక్టులు, సాగరమాల ప్రాజెక్టు పేరిట అన్ని రాష్ట్రాలకన్నా ఎక్కువ నిధులే ఇచ్చిందన్నారు.
తెలుగుదేశం ఒక డ్రామా కంపెనీ అని, ఎప్పటికప్పుడు ఒక్కో పాత్ర కోసం ఒక్కో వ్యక్తిని చంద్రబాబు వాడుకుంటారని ఎద్దేవా చేశారు. ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన అరెస్టు వారెంట్ విషయంలో బాబు కేంద్రంపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు నాగేంద్ర, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు.
టీడీపీ అవినీతిపై విస్తృత ప్రచారం
టీడీపీ అవినీతిని పార్టీ శ్రేణులంతా ప్రజలకు తెలియజెప్పాలని కన్నా పిలుపునిచ్చారు. విశాఖ సాగరతీరం రుషికొండ సాయిప్రియ రిసార్ట్స్‌లో ఉత్తరాంధ్ర బూత్‌స్థాయి కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.