
మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలు పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. వివిధ పోల్ సర్వేలు మాత్రం ఇప్పటికీ కర్ణాటకలో హంగ్ ప్రభుత్వమే ఏర్పడుతుందని చెబుతున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించే కాంగ్రెస్ పార్టీకి 90 నుంచి 95 సీట్లు, బీజేపీకి 85 నుంచి 90 సీట్లు వస్తాయని ఆ సర్వేలు సూచిస్తున్నాయి. 224 సీట్లు కలిగిన రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు కావాల్సిందే.
ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్‌కు 35 నుంచి 40 సీట్లు వస్తాయని పోల్ సర్వేలు అంచనా వేస్తున్న నేపథ్యంలో, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా దేవెగౌడ మద్దతు తప్పనిసరి. ఈ రెండు పార్టీలతోని విడివిడిగా కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర జేడీఎస్‌కు ఉంది. కనుక ఏ పార్టీకైనా అది మద్దతు ఇవ్వొచ్చు. లౌకిక భావాలు కలిగిన వ్యక్తిగా ముద్రపడిన దేవెగౌడ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సముఖంగా ఉన్నారని, ఆయన కుమారుడు కుమారస్వామి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
2004లో దేవెగౌడ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి రాష్ట్రంలో ధరమ్ సింగ్ నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించారు. రెండేళ్ల అనంతరం అంటే, 2006లో దేవెగౌడ కుమారుడు కుమారస్వామి కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకొని బీజేపీ మద్దతుతో తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏడాది తర్వాత ఆయన ప్రభుత్వం పడిపోయింది. కర్ణాటకలో బలమైన వర్గమైన ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన దేవెగౌడకు ప్రజల్లో ఇప్పటికీ మంచి ఆదరణే ఉంది. రాష్ట్రంలో ఒక్కలిగలు 12 శాతం మంది ఉన్న విషయం తెల్సిందే. ఆయన ఈసారి మాయావతి నాయకత్వంలోని బీఎస్పీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 20 శాతం ఉన్న దళితులు బీజేపీని వ్యతిరేకిస్తున్నందున ఈ సారి తమ కూటమికే ఓటు వేస్తారని పోల్ అంచనాలకన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన భావిస్తున్నారు.
1994లో వచ్చినట్లుగా 113 సీట్లు తమ పార్టీకి వచ్చినా రావచ్చని దేవెగౌడ అనుకుంటున్నారు. అది సాధ్యమయ్యే పనికాదు. ముస్లింల ఓట్లు దేవెగౌడకు పడకుండా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ రంగప్రవేశం చేశారు. ఆయనే ఇక్కడే తిష్టవేసి ముస్లిం ఓట్లను సమీకరిస్తున్నారు. ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో లాభపడుతుంది. ఇక దేవెగౌడతో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీఎస్పీ చీఫ్ మాయావతి పత్తా లేరు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిగానీ, డిప్యూటి ముఖ్యమంత్రి పదవిగానీ దక్కదు. అదే బీజేపీకి మద్దతిస్తే కుమారస్వామీకి డిప్యూటీ సీఎం ఖాయం. పోల్ అంచనాలకు మించి సీట్లు వస్తే సీఎం పదవి కూడా దక్కే అవకాశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే బీజేపీ ప్రధాన వ్యూహం. అప్పుడు బీజేపీ దేవెగౌడకు బదులుగా కుమారస్వామి వైపే మొగ్గు చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవెగౌడకు అన్ని విధాలుగా ఈ అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షే!
Comments
Please login to add a commentAdd a comment