
సాక్షి, హైదరాబాద్ : ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్ సీనియర్ నేత కె కేశవరావుపై టీజీ వెంకటేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కర్నె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీ లాంటి వ్యక్తుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కే నష్టం అని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీజీని అదుపులో ఉంచాలని సూచించారు.
టీజీ వెంకటేష్ అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని, అటువంటి పరిస్థితి రాకుండా ఉండేలా చూడాలంటూ చంద్రబాబును కోరారు. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రను కించపరచొద్దంటూ హితవు పలికారు. ప్రజలను రెచ్చగొట్టడమే టీజీ పరమావధిగా పెట్టుకున్నారని కర్నె మండిపడ్డారు.