
సాక్షి, హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని అంటున్నారని, ఈ కుట్రకు సంబంధించిన ఆధారాలను ఆయన బయటపెట్టాలని ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అన్నారు. 2019 ఎన్నికల్లో తాను రాజకీయాల్లోకి వస్తానని, చిత్తూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీచేసే అవకాశముందని పేర్కొన్నారు. ఒంగోలులో ఆదివారం ఆయన దళిత సంఘాల సమావేశంలో మాట్లాడారు. దళితులు రాజ్యాధికారం సాధించాలని, 2019 ఎన్నికల్లో దళితులదే వాయిస్ అని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో దళిత నాయకత్వం రావాలని అన్నారు. రాజకీయంగా ఇంకా దళితులు వెనుక బడి ఉన్నారని పేర్కొన్నారు. ప్రణయ్ హత్య కులదురహంకార హత్య అని అభివర్ణించారు. ఉగ్రవాదులతో చేతులు కలిపి మారుతీరావు ఈ హత్య చేయించారని పేర్కొన్నారు.