డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తాతో కథువా ఎమ్మెల్యే రాజీవ్ జస్రోటియా
సాక్షి, జమ్మూ : జమ్మూ కశ్మీర్ ప్రభుత్వంలో సోమవారం మంత్రి పదవులు స్వీకరించిన ఆరుగురు బీజేపీ శాసన సభ్యుల్లో ఒకరు కథువా శాసన సభ్యుడు రాజీవ్ జస్రోటియా కూడా ఉన్నారు. కథువాలో సంచారజాతి ముస్లిం కుటుంబానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై దారుణంగా రేప్ చేసి, హత్య చేసిన సంఘటనలో నిందితులకు మద్దతుగా జరిపిన ర్యాలీలో ఈ జస్రోటియా కూడా పొల్గొన్నారు. అంతేకాకుండా ఆ సంచార జాతి ముస్లింలను తరిమేసేందుకు వారిపై హింసను ప్రోత్సహించడమే కాకుండా ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన దారుణాన్ని కూడా బహిరంగంగా సమర్థించారు.
కథువా దారుణంలో నిందితులకు మద్దతుగా జనవరి 17వ తేదీన ‘హిందూ ఏక్తా మంచ్’ నిర్వహించిన ర్యాలీలో పొల్గొన్నారన్న కారణంగానే పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ శాసన సభ్యులు లాల్ సింగ్, చందన ప్రకాష్ గంగాలను బీజేపీ అధిష్టానం తొలగించింది. అదే ర్యాలీలో పాల్గొన్న కథువా బీజేపీ ఎమ్మెల్యే జస్రోటియాకే ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టింది. డిప్యూటీ ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ సహా మరికొంత మంది బీజేపీ మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ బీజేపీ అధిష్టానం దష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో చర్చలు జరిపిన పార్టీ అధిష్టానం రాష్ట్రంలోని మొత్తం తొమ్మిది మంది మంత్రుల్లో ఎనిమిది మందిని తొలగించాలని నిర్ణయించింది. ఆ మేరకు వారు రాజీనామా చేశారు.
ఆ స్థానంలో సోమవారం ఆరుగురు బీజేపీ శాసన సభ్యులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో ఒకరు సహాయ మంత్రి హోదా నుంచి పదోన్నది లభించిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ముఫ్తీ సూచన మేరకు రాష్ట్ర డిప్యూటి ముఖ్యమంత్రి పదవి నుంచి నిర్మల్ సింగ్‌ను పార్టీ అధిష్టానం తొలగించలేదని, ముఫ్తీకి చెక్ పెట్టేందుకు మరింత కరుడుగట్టిన ఆరెస్సెస్ నాయకుడు కవీందర్ గుప్తాను ఆయన స్థానంలో తీసుకొచ్చిందని స్థానిక బీజేపీ వర్గాలు తెలియజేస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కవీందర్ గుప్తా విలేకరులతో మాట్లాడుతూ కథువా సంఘటన చాలా చిన్న విషయమని, దాన్ని అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
కవీందర్ సింగ్ మొదటి నుంచి వివాదాస్పద నాయకుడే. 2015లో ఆయన రాష్ట్ర అసెంబ్లీలో స్వీకర్ బాధ్యతలు స్వీకరిస్తూ, తాను ఆరెస్సెస్ సభ్యుడిని అయినందుకు అత్యంత గర్వపడుతున్నానని, ఇక్కడ కేవలం స్పీకర్‌నేనని అన్నారు. ఇదిలా ఉండగా, కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో ఇద్దరికి నేరస్థులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. వారే కిష్టావర్ ఎమ్మెల్యే సునీల్ శర్మ, దోడా ఎమ్మెల్యే శక్తి పరిహార్‌లు. 2013లో ఈద్ నాడు ఓ ముస్లింను హత్యచేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పరారీలో ఉన్న హరి కషన్‌తో కలిసి వీరిద్దరు 2016, మార్చి నెలలో ఫొటో దిగారు.
అప్పటికే కోర్టు హరి కషన్‌ను ‘పరారీలో ఉన్న నిందితుడి’గా ప్రకటించింది. ఉధంపూర్ ఎంపీ, కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్ నివాసంలో ఈ ముగ్గురు కలిసి ఫొటో దిగారు. సింగ్, శర్మల తరఫున కశ్మీర్ ఎన్నికల్లో హరి కషన్ బహిరంగంగానే ప్రచారం చేశారు. ఓ ముస్లింను సజీవంగా దహనం చేసిన మరో కేసులో ప్రధాన నిందితుడు రోషన్ లాల్‌తో కూడా శర్మకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. కిష్టావర్‌లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌ను ఇరువురు కలిసి చూశారు. టీవీ ప్రసారాల్లో వారు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment