సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘టీఆర్‌ఎస్ బీజేపీకి బీ టీం అని రాహుల్‌బాబా అంటున్నారు.. కాంగ్రెస్ బీ టీం అని అమిత్‌షా అంటున్నారు.. ఈ రెండు పార్టీలు కలసి టీఆర్‌ఎస్‌ను బదనాం చేస్తున్నాయి. కానీ టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజలకు మాత్రమే బీ టీం’’అని ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ రెండు పార్టీలు మందిర్.. మసీద్‌ల గురించే మాట్లాడుతాయి.. ఒకరు బోఫోర్స్ అంటే., మరొకరు రాఫెల్ అంటారే తప్ప దేశ భవిష్యత్‌కు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు నాణానికి బొమ్మా బొరుసులాంటివని ఎద్దేవా చేశారు.
ప్రజలు ప్రాంతీయ పార్టీల ద్వారా జాతీయ దృక్పథం వైపు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాం నుంచి చెప్పుకొస్తోందని, ఇప్పుడు ఆమె మనవడు రాహుల్‌గాంధీ కాలం కూడా వచ్చిందని, ఇంకా పేదరికాన్ని రూపుమాపుతామని కాంగ్రెస్ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినా సుస్థిర పాలనను అందించగలుగుతాయని చెప్పారు, ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించిన టీఆర్‌ఎస్.. 16 ఎంపీ స్థానాలను గెలిపిస్తే.. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
కాళేశ్వరానికి నిధులివ్వలేదు: మంత్రి వేముల
రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు 90 శాతం నిధులిస్తున్న కేంద్ర ప్రభుత్వం, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు ఎందుకు నిధులు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. కనీసం 50 శాతం నిధులైనా ఇవ్వాలని, చేసిన పనులకు సంబంధించి రీయింబర్స్‌మెంట్ చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. కేంద్రం మొండిచెయ్యి చూపిందన్నారు. ఈ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను గెలుచుకుని భావసారూప్యత కలిగిన ప్రాంతీయ పార్టీతో కలిపి వందసీట్లు సాధించుకుంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవచ్చని అన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్త, నగర మేయర్ ఆకుల సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి
13 రాష్ట్రాల్లో పసుపు పండుతోందని కవిత తెలిపారు. ఆహార పంటల మాదిరిగానే పసుపునకు కూడా కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment