సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వాజ్‌పేయి విగ్రహం, ఎకరా స్థలంలో స్మారక భవనం నెలకొల్పుతామని ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటిం చారు. హైదరాబాద్‌తో వాజ్‌పేయికి ప్రత్యేక అనుబం ధం ఉందని, ఆయన జ్ఞాపకాలు, చర్యలు భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలన్నారు. గురువారం శాసనమండలి పదో సమావేశం జరిగింది. సమావేశాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు. ఇటీవల దివంగతులైన మాజీ ప్రధాని వాజ్‌పేయి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌ల మృతిపట్ల కేసీఆర్ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు.
కొండగట్టు ఆర్టీసీ బస్సు ప్రమాద మృతులకు, కేరళ వరదల్లో మృతి చెందిన వారికి చైర్మన్ స్వామిగౌడ్ తీర్మానాలు ప్రవేశపెట్టారు. మృతులకు సభ తీవ్ర సంతాపం ప్రకటిస్తూ కొద్దిసేపు మౌనం పాటించింది. సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ ప్రధానుల్లో మాజీ ప్రధాని వాజ్‌పేయి విలక్షణమైన నేత అని కొనియాడారు. ఆయన ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తి అని పేర్కొన్నారు. వాజ్‌పేయి ఏదో ఒక రోజు దేశానికి ప్రధాని అవుతారని జవహర్‌లాల్ నెహ్రూ చెప్పారని గుర్తుచేశారు.
బతికుండగానే వాజ్‌పేయికి భారతరత్న రావడం ఎంతో అదృష్టమని చెప్పారు. వాజ్‌పేయి ఉపన్యాసాలు మృదుభాషలో ఉంటాయన్నారు. దేశానికి ఉత్తమ పాలన అందించారని కొనియాడారు. విజయవంతం గా అణుపరీక్షలు నిర్వహించి, అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని గుర్తుచేశారు. వాజ్‌పేయి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ రాష్ట్రం, శాసన మండలి తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
కరుణానిధి కృషి వల్లే..
తమిళనాడు దివంగత మాజీ సీఎం కరుణానిధి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తీర్మానం ప్రవేశపెడుతూ.. ఆయన దేశ రాజకీయాల్లో ప్రత్యేక పాత్ర పోషించారని కొనియాడారు. కరుణానిధి కృషి వల్లే ముఖ్యమంత్రులు ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేస్తున్నారని పేర్కొన్నారు. తమిళనాడులో మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత కరుణానిధిదేనని కొనియాడారు. అనేక విషయాల్లో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కోసం ఆయన కృషి చేశారని, నీతి ఆయోగ్ సమావేశాల్లో సమాఖ్య స్ఫూర్తిని ప్రస్తావిస్తూ కరుణానిధి పేరును తాను గుర్తు చేసినట్లు చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం నిలబడ్డ ఏకైక వ్యక్తి కరుణానిధి అని కేసీఆర్ పేర్కొన్నారు.
కొండగట్టు మృతులకు సంతాపం
కొండగట్టు ఆర్టీసీ బస్సు ప్రమాద మృతులకు, కేరళ వరదల్లో మృతి చెందిన వారికి మండలి చైర్మన్ స్వామి గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తొమ్మిదో సభ జరిగి 6 నెలలు గడుస్తున్న నేపథ్యంలో నిబంధనల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శాసనసభ రద్దయిన తర్వాత మం డలి మాత్రమే సమావేశం కావడం ఉమ్మడి ఏపీ చరి త్రలో ఇదే తొలిసారి.
సంతాప తీర్మానాలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి పక్ష నేత షబ్బీర్ అలీ, బీజేపీ పక్ష నేత రామచందర్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్ మాట్లాడారు. సీఎం సంతాప తీర్మానాల అనంతరం ఏదో అంశంపై మాట్లాడాలని షబ్బీ ర్‌అలీ చైర్మన్‌ను కోరగా తిరస్కరించారు. మండలి సమావేశాలకు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఆధునీకరించిన భవనంలో..
ఆధునీకరించిన సమావేశ మందిరంలో గురువారం శాసనమండలి సమావేశాలు జరిగాయి. సీఎం కేసీఆర్ తొలుత అసెంబ్లీకి వచ్చి అక్కడి చాంబర్‌లో కొద్దిసేపు గడిపారు. అనంతరం మండలికి చేరుకున్నారు. మండలిలోని సీఎం చాంబర్‌లో కేసీఆర్ కొద్దిసేపు కూర్చున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలతో మాట్లాడి, అక్కడి నుంచి మండలి సమావేశ మందిరంలోకి వెళ్లారు.
నేరెళ్ల పేరుతో అవార్డు..
మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ మండలిలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయన పేరుతో రాష్ట్రంలో అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. మిమిక్రీ కళను విశ్వవిఖ్యాత కళాకారుడు, తెలంగాణ ముద్దుబిడ్డ అయిన నేరెళ్ల విశ్వవ్యాప్తం చేశారని పేర్కొన్నారు.
ఇందిరాగాంధీ గొంతు అనుకరిస్తే ఆమెనే మాట్లాడుతోందా అన్నంత స్పష్టంగా వచ్చేదని గుర్తు చేశారు. విశ్వనాథ సత్యనారాయణ, సినారె లాంటి కవులు తమ పుస్తకాలను వేణుమాధవ్‌కు అంకితమిచ్చారన్నారు. సీపీఎంకు లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ అనేక సేవలందించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మొట్టమొదటి కమ్యూనిస్టు నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. చట్టసభల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సోమ్‌నాథ్ సూచించారని కేసీఆర్ గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment