సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జాతీయ పార్టీలేవీ లేవని, అలా చలామణిలో ఉన్నవన్నీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ యాక్షన్ ప్లాన్–2020 సమ్మిట్‌లో పాల్గొన్నారు. ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో మాట్లాడుతూ.. ‘దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే. దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలేవీ లేవు. బీజేపీ, కాంగ్రెస్ సైతం పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన దేశం సాధ్యమవుతుంది. కేంద్రం విధివిధానాలు ఎన్ని ఉన్నా వాటి ఆచరణ అంతా రాష్ట్రాల్లోనే ఉందని పేర్కొన్నారు. కేంద్రం నిర్వహించే కార్యక్రమాల అమలును సైతం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాల్సి ఉంటుందని చెప్పారు. మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లోనూ రాష్ట్రాల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం వంటి అంశాలు కీలకంగా ఉంటాయన్నారు.
రాష్ట్రాలు ఇస్తేనే కదా..
‘రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తన సొంత నిధులు ఇస్తుందన్న ఆలోచన సరికాదు. రాష్ట్రాలు కూడా కేంద్రానికి నిధులు సమకూరుస్తుందన్న విషయం మరవకూడదు. తెలంగాణ నుంచి గడిచిన ఐదేళ్లలో రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే తిరిగి తెలంగాణకు కేంద్రం రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే.. కేంద్రం అన్ని నిధులను రాష్ట్రానికి తిరిగి ఇవ్వలేని విషయాన్ని గుర్తుంచుకోవాలి’అని పేర్కొన్నారు.
రాజకీయ ప్రత్యర్థులుగానే చూస్తాం
‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను శత్రువులుగా భావించట్లేదు. రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాడుతాం. అలాంటి పార్టీలతో వ్యక్తిగత శత్రుత్వం లేదు. తమ వాదన లేదా సైద్ధాంతికతకు వ్యతిరేకంగా నిలిచి ఉన్నంత మాత్రాన.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలను, లేదా ఇతర పార్టీలను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. కేంద్రం చేపట్టిన అనేక చర్యలను అంశాల వారీగా మద్దతిచ్చిన మేం.. ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలనూ వ్యతిరేకించాం’అని పేర్కొన్నారు.
నోట్ల రద్దుపై మా నిర్ణయం తప్పు..
‘పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశానికి మంచి జరుగుతుంది.. సంపూర్ణ క్రాంతి వస్తుందన్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం అన్న మాటలు నమ్మి మద్దతిచ్చాం. కానీ పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశానికి నష్టం జరిగిన విషయం తేలిన తర్వాత మా నిర్ణయం తప్పని తేలింది’అని కేటీఆర్ వివరించారు. ‘టీఆర్‌ఎస్.. బీజేపీ ‘బీ’టీమ్ అని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ ‘బీ’టీం అని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. మేం తెలంగాణ ప్రజలకు ‘ఏ’టీం మాత్రమే. ఎవరికీ మేం ‘బీ’టీం కాదు’అని చర్చలో పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు
‘గత కొంతకాలంగా జరుగుతూ వస్తున్న ప్రతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తున్నాయి. భవిష్యత్తులో కచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇప్పటికే నిరాశ పరిచాయి. ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దేశ ప్రజల ఆకాంక్షలను అందుకోలేకపోయాయి. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు’అని కేటీఆర్ వివరించారు.
భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం
‘పౌరసత్వ సవరణ చట్టాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం ఇలాంటి వివాదాస్పద చట్టాలపై కాకుండా.. అతి ప్రాధాన్యత కలిగిన ఇతర అంశాలపై దష్టి సారించాల్సి ఉంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.. అలాంటప్పుడు ఒక వర్గంపై ఎలా వివక్ష చూపుతారు?’అని మంత్రి ప్రశ్నించారు.
రెండో రాజధానిగా ప్రజలు స్వాగతిస్తారో లేదో తెలియదు
‘జీవించడానికి అనుకూలమైన అత్యుత్తమ నగరాల్లో మెర్సర్ గత ఐదేళ్లుగా హైదరాబాద్‌కు అగ్రస్థానం కల్పిస్తూ వస్తోంది. భారతదేశాన్ని రెండో జాతీయ రాజధానిగా ప్రకటించాల్సి వస్తే హైదరాబాద్ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో నాకు అనుమానం ఉంది’అని పేర్కొన్నారు.
సమాఖ్య స్ఫూర్తి ఏది?
‘కో–ఆపరేటివ్ ఫెడరలిజం, టీమిండియా వంటి మాటలు చెప్పే ప్రధానమంత్రి.. ఆ భావనల స్ఫూర్తి ఆధారంగా పని చేయాలని కోరుకుంటున్నాం. నీతి ఆయోగ్ తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించాలని అనేక సూచనలు చేసినా, ఇప్పటిదాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’అని దుయ్యబట్టారు. కేంద్రం ఆర్థిక సంస్కరణలు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు వంటి అంశాల్లో మరింత లిబరల్‌గా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
జాతీయ పార్టీల్లేవ్ : కేటీఆర్
Published Fri, Feb 14 2020 3:21 AM | Last Updated on Fri, Feb 14 2020 3:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment