![Key changes in Andhra Pradesh politics have taken place a year before the 1972 elections - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/28/X7UJ9.jpg.webp?itok=V2cRmO_K)
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జలగం వెంగళ్రావు
1972 ఎన్నికలకు ఏడాది ముందునుంచే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమార్పులు చోటుచేసుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకోసం ఉద్యమాన్ని నడిపిన మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) ప్రభావం రాష్ట్రంలో స్పష్టంగా కనిపించింది. నాటకీయ పరిణామాల మధ్య చెన్నారెడ్డి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ రాజకీయాల పరిణామక్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు తొలి తెలంగాణ సీఎంగా పీవీ నరసింహారావు బాధ్యతలు స్వీకరించారు. 1972 మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నడూలేనంత ఘన విజయం సాధించింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52.3% ఓట్లు సంపాదించింది. అంతకుముందు, ఆ తర్వాత కాంగ్రెస్ ఎప్పుడూ ఇంతశాతం ఓట్లను పొందలేదు. తెలంగాణలోని 101 సీట్ల (ఏపీ మొత్తంగా 287)లో ఎస్సీలకు 17, ఎస్టీలకు మూడు అసెంబ్లీ స్థానాలు రిజర్వ్‌చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు 17 మంది పోటీలేకుండా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 78 సీట్లు వచ్చాయి. అయితే 1972 చివర్లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడం.. దీన్ని సమర్థవంతంగా అణచివేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలతో సీఎం పదవిని పీవీ వదులుకోకతప్పలేదు. ఆ తర్వాత 11 నెలలపాటు రాష్ట్రపతి పాలన తర్వాత జలగం వెంగళ్రావు సీఎం బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి.
ఇందిర జోరుకు చెన్నారెడ్డి బ్రేకులు
నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1971లో ముందస్తు పార్లమెంటు ఎన్నికలకు వెళ్లారు. ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ (కొత్త కాంగ్రెస్ లేదా కాంగ్రెస్–రిక్విజిషనిస్ట్) ఘనవిజయం సాధించింది. అంతకు కొద్దినెలల క్రితమే బంగ్లాదేశ్ అవతరణకు దారి తీసిన యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ విజయం తర్వాత జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తిరుగులేని విజయాలు లభించాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆమె పప్పులు ఉడకలేదు.
ఇందిర జోరుకు చెన్నారెడ్డి బ్రేకులు వేశారు. ఈ ప్రాంతంలోని మొత్తం 14 పార్లమెంటు స్థానాల్లో టీపీఎస్ 10చోట్ల విజయం సాధించింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానంద రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. టీపీఎస్ ఘన విజయం.. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య చెన్నారెడ్డి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం జరిగింది. ఈ సమయంలో ఇందిర, చెన్నారెడ్డి మధ్య కుదిరిన ఒప్పందాల్లో భాగంగానే పీవీ నరసింహారావు (తెలంగాణకు సీఎం పదవి ఇవ్వాలని)ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే.. పీవీ 1971 సెప్టెంబర్ 30 ప్రమాణం చేసిన ఆరు నెలలకే 1972 మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
మైనార్టీలు, బీసీలకు గుర్తింపు
టికెట్ల కేటాయింపులో గతంలో పోల్చితే తెలుగునాట వెనుకబడిన కులాలు, మైనారిటీలకు కొంత ప్రాధాన్యం కూడా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి కారణమైంది. చీలిక తర్వాత సీపీఎం నుంచి అనేక నక్సలైట్ పార్టీలు పుట్టడం కామ్రేడ్లకు చాలా నష్టం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులకే ఎక్కువ సీట్లు (16) రావడం ఇందుకు నిదర్శనం. సీపీఐకి మూడు, ఎంఐఎంకు రెండు సీట్లు లభించాయి. చెన్నారెడ్డి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఇష్టంలేని కొందరు నేతలు ‘సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి’పేరుతో పోటీచేశారు. ఇందులో రిపబ్లికన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జెట్టి ఈశ్వరీబాయి ఒక్కరే గెలిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి టికెట్ లభించకపోవడంతో వారు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీచేశారు. వారిలో కొందరు ఇండిపెండెంట్లుగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 57 మంది స్వతంత్రులుగా గెలిచారు. పీసీసీ అధ్యక్షునిగా కాకినాడకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ ఉన్నారు. ముఖ్యమంత్రి పీవీ, పీసీసీ నేత ఇద్దరూ పలుకుబడి ఉన్న నేతలు కాకపోవడంతో రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ హైకమాండ్ పెత్తనం పెరిగింది.
ఆరేళ్ల అసెంబ్లీ ఇదొక్కటే!
1972 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన ఐదో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆరేళ్లపాటు కొనసాగింది. ఎమర్జెన్సీ కాలంలో చట్ట సవరణతో అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితిని మరో ఏడాది పొడిగించారు. ఈ కారణంగా మామూలుగా 1977లో జరగాల్సిన ఎన్నికలు 1978లో జరిగా యి. ఈ ఆరేళ్ల కాలం లో పీవీ, జలగం కలిసి ఐదేళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. రాష్ట్రపతి పాలనను తెలుగు ప్రజలు మొదటిసారి చూశారు.
చివరిసారిగా అసెంబ్లీకి పీవీ
సీఎం పీవీ నరసింహారావు నాలుగోసారి కరీంనగర్ జిల్లా మంథని నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన అసెంబ్లీకి పోటీచేయడం ఇదే చివరిసారి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి జేవీ నరసింగరావు లక్సెట్టిపేటలో మరోసారి విజయం సాధించారు. పీవీ తర్వాత రెండో తెలంగాణ ప్రాంత సీఎం అయిన జలగం వెంగళరావు వేంసూరులో విజయంసాధించారు. పీవీ కేబినెట్ సభ్యులైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు జె.చొక్కారావు (కరీంనగర్), మహ్మద్ ఇబ్రహీం అలీ అన్సారీ(పాలమూరు), ఎం.మాణిక్‌రావు (తాండూరు), సహాయ మంత్రులు సి.రాజనరసింహ (ఆంధోల్), పి.మహేంద్రనాథ్ (అచ్చంపేట), కె.భీంరావు (ఆసిఫాబాద్), ఎ.మదన్‌మోహన్ (సిద్దిపేట) విజయం సాధించారు.
మరో కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి నిర్మల్ నుంచి మళ్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత ఎస్ జైపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా కల్వకుర్తి నుంచి మరోసారి గెలిచారు. కొన్నేళ్ల తర్వాత కేబినెట్ మంత్రి అయిన కమతం రాంరెడ్డి పరిగి నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు టి.అంజయ్య (ముషీరాబాద్), కొండా లక్ష్మణ్ బాపూజీ (భువనగిరి), పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి (మునుగోడు) తదితరులు కూడా శాసనసభకు ఎన్నికయ్యారు. పీవీ కేబినెట్ మంత్రి టి.హయగ్రీవాచారి ఘన్‌పూర్ నుంచి సీపీఐ నాయకురాలు ఆరుట్ల కమలాదేవిపై విజయం సాధించారు. 1969–71 మధ్య జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి టికెట్‌పై గెలిచిన ఎ.మదన్‌మోహన్ (సిద్దిపేట), నాగం కృష్ణారావు (ఖైరతాబాద్) ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం నేత సలావుద్దీన్ ఓవైసీ హైదరబాద్ నగరంలోని యాకుత్‌పురాలో జనసంఘ్ అభ్యర్థి ఆర్.అంజయ్యను ఓడించి అసెంబ్లీకి మూడోసారి వరుసగా ఎన్నికయ్యారు.
తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు కాలంలో సహచరులతో మర్రి చెన్నారెడ్డి
పీవీ సర్కారు రాజీనామా, రాష్ట్రపతి పాలన!
రాష్ట్రంలో మొత్తం 219 సీట్లు, తెలంగాణలో దాదాపు ఐదింట నాలుగొంతుల సీట్లు (78/101) కైవసం చేసుకున్నా ఎన్నికలు జరిగిన ఏడాదిలోపే వచ్చిన ముల్కీ నిబంధనల రద్దుకు, తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ వచ్చిన ‘జై ఆంధ్ర’ఉద్యమం ఊపందుకుంది. దీని కారణంగా పీవీ ప్రభుత్వం 1973 జనవరి రెండో వారంలోనే రాజీనామా చేసింది. ఉద్యమం కారణంగా పాలన స్తంభించడంతో అప్పటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ 11నెలలు రాష్ట్రపతి పాలన విధించారు. డిసెంబర్‌లో మాజీ హోంమంత్రి వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు.
ఓడిన ప్రముఖులు
కాంగ్రెస్ నేత డీకే సత్యారెడ్డి కుమారుడు డీకే సమరసింహారెడ్డి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి టికెట్‌పై గద్వాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. అలాగే అంతకుముందు అసెంబ్లీకి రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన టీఎన్ సదాలక్ష్మి వికారాబాద్‌లో స్వతంత్ర అభ్యర్థి తిరుమలయ్య చేతిలో ఓడిపోయారు. అంతకుముందు ఏఎస్పీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బద్రివిశాల్ పిత్తీ మహరాజ్‌గంజ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపో యారు. గతంలో రెండుసార్లు విజయం సాధించిన కాంగ్రెస్ నాయకురాలు రెడ్డిగారి రత్నమ్మ రామాయంపేటలో ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కమ్యూనిస్ట్ నేత చెన్నమనేని రాజేశ్వరరావును సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నరసింగరావు ఓడించారు. కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్.యతిరాజారావు భార్య విమలాదేవి వరంగల్ జిల్లా చెన్నూరులో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఆరుగురు మహిళలు శాసనసభకు ఎన్నికయ్యారు. వారిలో ఐదుగురు కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. రిపబ్లికన్ పార్టీ నాయకురాలు జెట్టి ఈశ్వరీబాయి ఈసారి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి తరఫున గెలిచారు.
పార్లమెంటులో టీపీఎస్ జోరు
తెలంగాణలోని మొత్తం 14 ఎంపీ సీట్లలో టీపీఎస్ 10 స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రాజా రామేశ్వరరావు (పాలమూరు), జీఎస్ మేల్కొటే (హైదరాబాద్), ఎంఎం హషీం (సికింద్రాబాద్), ఎం.మల్లికార్జున్ (మెదక్), ఎం.సత్యనారాయణరావు (కరీంనగర్), కంచర్ల రామకృష్ణారెడ్డి (నల్లగొండ), వి.తులసీరాం (పెద్దపల్లి–ఎస్సీ)లు టీపీఎస్ తరపున గెలిచి తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లారు. డీకే సత్యారెడ్డి (పాలమూరు), కేఎల్ నారాయణ (సికింద్రాబాద్), టీఎన్ సదాలక్ష్మి (టీఈసీ) వంటి ప్రముఖులకు ఓటమి తప్పలేదు. మిర్యాలగూడ నుంచి సీపీఎం అభ్యర్థిగా భీంరెడ్డి నర్సింహారెడ్డి గెలుపొంది తొలిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు.
ఏకగ్రీవ హీరోలు
మక్తల్ – రామచంద్రరావు కల్యాణీ
తాండూరు – ఎం.మాణిక్‌రావు,
ముధోల్ – జి.గడ్డెన్న
నిర్మల్ – పి.నర్సారెడ్డి
ఆ ఐదుగురు
శాంతాబాయి తపాలికర్ – గగన్‌మహల్
బి.సరోజినీ పుల్లారెడ్డి – మలక్‌పేట
సుమిత్రాదేవి – మేడ్చల్
దుగ్గినేని వెంకట్రావమ్మ – మధిర
ప్రేమలతా దేవి – నుస్తులాపూర్
Comments
Please login to add a commentAdd a comment