సమావేశంలో మాట్లాడుతున్న రాధకిషోర్
సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపాటుకు గురైన మానుకొండ రాధకిశోర్ ఖమ్మం రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 19న నామినేషన్ వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం తన అనుచరులతో ఖమ్మం నగరంలోని బల్లేపల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసినవారికి టికెట్ కేటాయించకుండా కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల నిర్ణయమె తనకు శిరోధార్యమని, తనను అభిమానించే వారి సూచనలు, నిర్ణయాల ప్రకారం ఈ నెల 19 వ తేదీన కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
2014లో కూడా టికెట్ త్యాగం చెయ్యమంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన వ్యక్తి పార్టీ మారినా.. క్యాడర్‌ను కాపాడుకోవటంలో కీలకపాత్ర పోషించానన్నారు. అలాంటి తమను గుర్తించకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు సంబాని చంద్రశేఖర్ కూడా టికెట్ త్యాగం చేశారని, సీనియర్ నేత రేణుకా చౌదరి వర్గంగా ఉన్న తాము గెలిస్తే ఇక్కడ వారి ఆటలు సాగవని కొంత మంది కుట్రలు చేశారని ఆరోపించారు. తనతో పాటు పోట్ల నాగేశ్వరరావు, గాయత్రి రవిలకు కూడా టికెట్ ఇస్తామని చెప్పి అవమానపర్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు తీవ్రని అన్యాయం చేసిందన్నారు. మహాకూటమి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు బరిలోకి దిగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment