
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి మాజీ సీఎం చంద్రబాబు వైఖరే కారణమని, పది రోజులుగా ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వేధించారని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆరోపించారు. చివరికి హైదరాబాద్‌లో కలుద్దామని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయించి మానసిక క్షోభకు గురి చేశాడన్నారు. సోమవారమైనా అపాయింట్‌మెంట్ ఇస్తాడని ఉదయం 9.30 గంటల వరకు ఆయన వేచి చూశారని, అయితే హైదరాబాద్ నుంచి చంద్రబాబు విజయవాడ బయలుదేరాడని తెలుసుకున్న తర్వాత కోడెల ఉరివేసుకొని చనిపోయాడని చెప్పారు.
మంగళవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కోడెల మృతిపై శవ రాజకీయాలు చేయొద్దని చంద్రబాబును హెచ్చరించారు. కోడెల మరణంలో చంద్రబాబు పాత్రపై విచారణ చేసి ఆయన్ను ఏ1 ముద్దాయిగా చేర్చాలని, ఆయన కాల్‌డేటాను పరిశీలించి చంద్రబాబును కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించాడో బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కోడెలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కేసులు నమోదు చేయలేదని స్పష్టం చేశారు.
చంద్రబాబువి మొసలికన్నీరు..
వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చినా చంద్రబాబు మాట విని కోడెల వారిపై అనర్హత వేటు వేయకుండా సహకరించారని కొడాలి నాని గుర్తు చేశారు. కోడెల కుమారుడిని పెట్టుకొని లోకేష్ కమీషన్లు తీసుకొని వాటాలు పంచుకున్నారన్నారు. వర్ల రామయ్య లాంటి వ్యక్తులతో కోడెలపై విమర్శలు చేయించారని, సత్తెనపల్లిలో ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు తయారు చేశారని చెప్పారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మూడు రోజుల కిందట గుంటూరులో చంద్రబాబు సమావేశం నిర్వహించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆయన నమ్ముకున్న కుటుంబ సభ్యులు, పార్టీ, పార్టీ అధ్యక్షుడు వదిలించుకోవాలని చేసిన ప్రయత్నాలకు ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.