
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకంటే పాలకులకే ఎక్కువ మేలు జరుగుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. టీజేఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఒక కుటుంబం కోసమే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఆ కుటుంబం లాభం పొందడం కోసమే ప్రాజెక్టు వ్యయం భారీగా పెంచారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం ఇంజనీరింగ్ పరంగా ఏ మాత్రం మంచిది కాదన్నారు. కొంతమంది ప్రయోజనమే అందులో ప్రాధాన్య అంశంగా మారిందన్నారు. భారీగా పెరిగిన వ్యయంలో కమీషన్లు ఎవరికి పోతున్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు.
ఇలాంటి వాటిని ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేయవద్దంటూ, దీనిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులను పిలవాలని, ఎవరి వాదన తప్పో వారే తేల్చుతారన్నారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరిపితే నాయకులంతా జైలుకు వెళ్లడం ఖాయమని ఆరోపించారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు నివేదికను టీజేఏస్ సిద్ధంచేసి, చర్చకు పెట్టిందన్నారు. దానిని నీటిపారుదల శాఖ అధికారులకు పంపించామన్నారు. అయితే తాము లేవనెత్తిన అంశాల్లో ఒక్కదానికీ మంగళవారం మంత్రి హరీశ్‌రావు ప్రెస్ మీట్‌లో సమాధానం ఇవ్వలేదన్నారు.
తుమ్మిడిహెట్టి వద్దకు నీళ్లు తెచ్చుకోవచ్చన్నారు. అక్కడ నీళ్లు లేవనే చర్చను ప్రభుత్వం అసంబద్ధంగా లేవనెత్తుతోందన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర కాకపోతే ఎల్లంపల్లితోపాటు ఇతర ప్రదేశాల్లో కట్టుకునేలా ప్రత్యామ్నాయం ఉందన్నారు. తుమ్మడిహెట్టి వద్ద నీళ్లు లేకపోతే మేడిగడ్డకు ఎలా వస్తాయని ప్రశ్నించారు. వీలైనంత తక్కువ ఖర్చుతో లిఫ్ట్‌ల నిర్మాణం చేపట్టవచ్చన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నుంచి నీళ్లు తెస్తే రూ.40 వేల కోట్లు ఆదా అవుతాయన్నారు.
తద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్, డబుల్ బెడ్ రూమ్ వంటి పథకాలకు ఆర్థికంగా ఇబ్బంది ఉండేది కాదన్నారు. దళితులకు మూడెకరాల భూమి కొనుగోలు చేసేందుకు ఉపయోగపడేవన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయే పరిస్థితి ఉండేది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు తప్పదని, అది జరిగిన రోజు మాత్రం టీఆర్‌ఎస్ నాయకులు అంతా చంచల్‌గూడ జైలుకు వెళ్లడం ఖాయమని కోదండరాం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment