
స్పీకర్ కోడెల పేరుతో నిర్మించిన స్టేడియాన్ని అభివృద్ధి చేసేందుకు.. నర్సరావుపేట, తెనాలి నియోజకవర్గాల పరిధిలోని పాఠశాలల్లో డబ్సులు వసూలు చేయాలంటూ గుంటూరు కలెక్టర్ ఇచ్చిన అదేశాలు
సాక్షి, అమరావతి : బాధ్యత కలిగిన రాజ్యాంగ పదవిలో ఉన్నవారే అనైతికంగా వ్యవహరిస్తే ఇక సమాజంలో నీతికి విలువ ఉంటుందా? రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వ నిధులతో తన పేరిట నిర్మించిన స్టేడియాన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటూ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం జారీ చేశారు. 2015 నవంబర్ నుంచి ఈ వసూళ్ల దందా కొనసాగుతోంది. డబ్బులు ఇవ్వకపోయినా, దీని గురించి బయట ఎవరికైనా చెప్పినా విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేస్తామని, కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు.
కోడెల తనయుడి జేబులోకే నిధులు..
గుంటూరు జిల్లాలో నర్సరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో కోడెల శివప్రసాదరావు తన పేరుతోనే క్రీడా మైదానాన్ని నిర్మించారు. రూ.వందల కోట్ల ప్రభుత్వ నిధులతో ‘కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం’ను నిర్మించారు. ఈ ప్రాంగణంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను తెనాలి, నర్సరావుపేట నియోజకవర్గాల్లోని ప్రైవేట్ సూళ్లు, కాలేజీల నుంచి ప్రతినెలా వసూలు చేయాలని స్పీకర్ కోడెల, తెనాలి ఎమ్మెల్యే నిర్ణయానికి వచ్చారు. నర్సరావుపేట, తెనాలి నియోజకవర్గాల్లో క్రీడా మైదానాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై 2015 అక్టోబర్ 3న స్పీకర్ కోడెల గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రీడా ప్రాంగణాల అభివృద్ధి కోసం నర్సరావుపేట, తెనాలి నియోజకవర్గాల్లో ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి నిధులు వసూలంటూ హుకుం జారీ చేశారు. ఈ మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి నెలకు ఇంత చొప్పున నిధులు వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చేశారు. వసూలు చేసే నిధులు స్టేడియాల అభివృద్ధికి కాకుండా నేరుగా కోడెల తనయుడి జేబులోకి వెళ్తున్నాయని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు చెబతున్నాయి. ఇప్పటిదాకా వసూలు చేసిన సొమ్ముతో చేసిందేమీ లేదని విమర్శిస్తున్నాయి.
కలెక్టర్ ఆదేశాల్లో ఏముందంటే...
- నర్సరావుపేట, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్లే స్కూళ్లు మొదలుకొని ఆరో తరగతి వరకు గల ప్రైవేట్ పాఠశాలల నుంచి నెలకు రూ.2,500 చొప్పున సంవత్సరానికి రూ.30,000 వసూలు చేయాలి.
- ప్లే స్లూళ్లు మొదలుకొని పదో తరగతి వరకు గల ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి నెలకు రూ.5,000 చొప్పున సంవత్సరానికి రూ.60,000 వసూలు చేయాలి.
- ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల నుంచి నెలకు రూ.7,500 చొప్పున సంవత్సరానికి రూ.90,000 వసూలు చేయాలి.
- స్పీకర్ కోడెల పేరుతో నిర్మించిన స్టేడియాన్ని అభివృద్ధి చేసేందుకు.. నర్సరావుపేట, తెనాలి నియోజకవర్గాల పరిధిలోని పాఠశాలల్లో డబ్సులు వసూలు చేయాలంటూ గుంటూరు కలెక్టర్ ఇచ్చిన అదేశాలు