మాట్లాడుతున్న పార్థసారథి, పక్కన రక్షణనిధి, కైలే అనిల్ కుమార్, బొప్పన భవకుమార్
విజయవాడ సిటీ: ప్రజలకు మేలైన పరిపాలన అందించి వారి హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించాలన్నది వైఎస్ జగన్ ఆకాంక్ష అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పెనమలూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజలిచ్చిన తీర్పు చంద్రబాబు అహంకారానికి చెంపదెబ్బగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబు అరాచక, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే జీవితాల్లో మార్పు వస్తుందని ప్రగాఢంగా నమ్మారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఎన్నో దీక్షలు, పోరాటాలు చేసిన నేతగా వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారని తెలిపారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కైలే అనిల్‌కుమార్ (పామర్రు), కొక్కిలిగడ్డ రక్షణనిధి (తిరువూరు), పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొప్పన భవకుమార్‌తో కలిసి ఆయన మంగళవారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
మా కార్యకర్తలు చిత్తశుద్ధితో పని చేశారు
చంద్రబాబు పాలనను తరిమికొట్టాలనే లక్ష్యంతో వైఎస్సాసీపీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేశారని తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో ఏ పార్టీ కూడా 50 శాతం ఓట్లు సాధించిన దాఖలాలు లేవన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, దుష్టపాలనను కప్పిపుచ్చిన ఎల్లో మీడియా నేటికీ బుద్ధి తెచ్చుకోకుండా వైఎస్ జగన్ మాటలను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ‘గెలిచిన మరుక్షణం రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో నదీజలాల గురించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించి సాయం కోరారు. కానీ, కొన్ని మీడియా సంస్థలు కేంద్రంతో యుద్ధం ప్రకటించాలని ప్రచారం చేస్తున్నాయి. ముందు మేం రిక్వెస్ట్ చేస్తాం.. అని ప్రకటిస్తే అడుక్కోవడం అని వక్రీకరించారు. వైఎస్ జగన్ పోరాట పటిమ ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసు’ అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించే విషయంలో ఆయన చిత్తశుద్ధితో ఉంటారన్నారు. చంద్రబాబు ప్రజల సొమ్ముతో ధర్మపోరాట దీక్షలు నిర్వహించి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారన్నారు. కానీ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా.. ప్రభుత్వంపై ఆర్థికభారం పడకుండా వైఎస్ జగన్ ఈ నెల 30న (గురువారం) మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలిపారు.
లోకేష్‌వి ఉత్తరకుమార ప్రగల్భాలు..
లోకేష్‌కు కూడా చంద్రబాబులాగా ఏరుదాటక తెప్ప తగలేసే అలవాటు ఉన్నట్లుగా కనబడుతోందన్నారు. 2014లో విజయం సాధిస్తే అది చంద్రబాబు గొప్పతనం, అనుభవం, దూర దృష్టి అంటూ ఆకాశానికి ఎత్తేశారని, నేడు ఓడిపోతే 90 శాతం కార్యకర్తలు, నాయకులదే బాధ్యత అని చెప్పే స్థాయికి లోకేష్ దిగజారిపోయారని విమర్శించారు. ఓడిపోయిన చోటే తిరిగి గెలిచే సత్తా ఉందని లోకేష్ వ్యాఖ్యలను ఉత్తరకుమార ప్రగల్భాలుగా అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment