సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌పై పోటీ చేసి తాను 50 వేల మెజార్టీతో గెలిచి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గురువారం మధ్యాహ్నాం ఆయన తెలంగాణ అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. నల్గొండ నుంచి కేసీఆర్ పోటీ చేయాలని కోరుతున్నానని, రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆయన గెలవలేరని, అక్కడ విజయం తనదేనని కోమటిరెడ్డి చెప్పారు. కేసీఆర్ నల్గొండ నుంచి పోటీ చేసినా లేదా తానే గజ్వేల్ లో పోటీ చేసినా గెలుపు మాత్రం తనదేనని ఆయన అంటున్నారు. ఒకవేళ 50 వేల మెజార్టీతో గనుక తాను గెలవకుంటే.. వెంటనే రాజకీయ సన్యాసం చేస్తానని కోమటిరెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రశంసలు గుప్పించిన ఎంఐఎం శాసనసభపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అక్బరుద్దీన్ పొగిడిన అంశాన్ని తాము పెద్దగా పట్టించుకోమంటూనే, అక్బరుద్దీన్ నాలుకకు నరం లేదంటూ విమర్శించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అక్బరుద్దీన్ మమ్మల్ని పొగిడేవారని కోమటిరెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment