మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఒక్క సభ.. ఒకే ఒక్క బహిరంగ సభ జిల్లా రాజకీయాలను పూర్తిస్థాయిలో వేడెక్కించింది. ఆపద్ధర్మ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్న గురువారం నాటి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభతో గులాబీ శ్రేణులు ఫుల్ జోష్‌లోకి వచ్చాయి. దాదాపు వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి సభకు జనాన్ని సమీకరించారు. తాము ఆశించిన దానికంటే సభ విజయవంతం కావడంతో పార్టీ అభ్యర్థులు, నాయకులు సంబరంలో మునిగిపోయారు.
ఈ బహిరంగ సభ వేదికగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలు కాంగ్రెస్‌లో చురుకు పుట్టించాయి. కేసీఆర్ తన ప్రసంగంలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తప్పుబడుతూనే.. ఉమ్మడి జిల్లా నేతలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిలపై చేసిన విమర్శలకు గురువారం పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీటుగా స్పందించారు. జిల్లా అభివృద్ధి, ప్రాజెక్టులు, ఫ్లోరైడ్ సమస్య తదితరఅంశాలపై కేసీఆర్ చేసిన ప్రసంగంపై కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
విమర్శలు – ప్రతి విమర్శలు
జిల్లా కాంగ్రెస్‌పై, గత కాంగ్రెస్ పాలనపై, ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై కేసీఆర్ చేసిన విమర్శలను కోమటిరెడ్డి తిప్పికొట్టారు. ఫ్లోరైడ్ సమస్యపై తానే పదకొండు రోజుల పాటు దీక్ష చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. నాటి టీడీపీ ప్రభుత్వం మెడలు వంచామని, కృష్ణా జలాలు సాధించామని, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న హయాంలో అత్యధిక ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు నీళ్లందించామని చెప్పుకొచ్చారు.
దామరచర్లలోని థర్మల్ పవర్ ప్రాజెక్టు మంత్రి జగదీష్‌రెడ్డి, ఆయన అనుచరులు దోచుకునేందుకు మొదలు పెట్టారని కోమటిరెడ్డి ప్రతి విమర్శ చేశారు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును ఆపి తీరుతామని కుండబద్దలు కొట్టారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పనులకు నిధులు ఇవ్వడం లేదని, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేస్తే తనెక్కడ పేరు వస్తుందోనని రైతులకు అన్యాయం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక వైపు గురువారం నాటి కేసీఆర్ ప్రసంగాన్ని తప్పుపడుతూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రతి విమర్శలు టీఆర్‌ఎస్‌కు ఆగ్రహం తెప్పించాయి.
టీఆర్‌ఎస్ ఎదురు దాడి
తమ అధినేత కేసీఆర్‌ను, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిపై విమర్శలు చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై జిల్లా టీఆర్‌ఎస్ నాయకులు ఎదురు దాడికి దిగారు. నల్లగొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తదితరులు తక్షణం స్పందించి ప్రతి విమర్శలు చేశారు. తన చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకే కోమటిరెడ్డి కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్రాజెక్టును తాము అధికారంలోకి వస్తే నిలిపివేస్తామన్న కోమటిరెడ్డి ప్రకటనపై ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు. పవర్ ప్రాజెక్టును రద్దు చేస్తామన్న ప్రకటన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తిగత ప్రకటనా, లేకుంటే కాంగ్రెస్ పాలసీనా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తక్షణం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గులాబీ బాస్ కేసీఆర్ చేసిన ప్రసంగంపై జిల్లా కాంగ్రెస్ శ్రేణులూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్నీ మాయమాటలు, అబద్దాలు మాట్లాడరని దుయ్యబట్టాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల ప్రకటనలు జిల్లాలో చర్చనీయాంశం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment