సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇరవై అయిదు మంది విద్యార్థులు చనిపోయారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది విద్యార్థులు చనిపోయారని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అదే పరిస్థితి పునరావృతం అవుతోందన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలనే నిర్వహించలేని ముఖ్యమంత్రి .. ప్రధాని ఎట్లవుతారంటూ చురకలు అంటించారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 48 గంటల దీక్షకు కోమటిరెడ్డి శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో తెలంగాణ పూర్తిగా భ్రష్టు పట్టిందని, చనిపోయిన విద్యార్థి కుటుంబాలను పరామర్శించడానికి సైతం ముఖ్యమంత్రికి తీరిక లేదని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు మీద ఉన్న ఆసక్తి రాష్ట్ర పాలన మీద లేదన్నారు. గ్లోబరీనా సంస్థపై మర్డర్ కేస్ పెట్టాలని, అవినీతి అధికారి అశోక్‌ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అసమర్థుడు విద్యాశాఖ మంత్రి కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ మాట్లాడుతూ, చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలతో విద్యార్థులు బలౌతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నేత టి.పురుషోత్తంరావు, మధుయాష్కీ గౌడ్, జాతీయ యువజన కాంగ్రెస్ నేతలు బల్మూరి వెంకట్, అనిల్‌కుమార్‌యాదవ్‌లచే దీక్ష విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment