అగ్రవర్ణాలదే ఆధిక్యం | Kommineni Srinivasa Rao Social analysis on 1957 elections | Sakshi
Sakshi News home page

అగ్రవర్ణాలదే ఆధిక్యం

Published Tue, Nov 20 2018 3:48 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Kommineni Srinivasa Rao Social analysis on 1957 elections - Sakshi

1956 నాటికి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. హైదరాబాద్‌ రాష్ట్రంలోని కన్నడ ప్రాబల్యం ఉన్న జిల్లాలు కర్ణాటకకు, మరాఠీ ప్రభావం కలిగిన జిల్లాలు మహారాష్ట్రలో కలవగా, తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతమంతా ఆంధ్రప్రదేశ్‌తో కలిసింది. మద్రాస్‌ నుంచి విడివడిన ఆంధ్ర రాష్ట్రానికి 1955లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 1956లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాయి. అప్పటి ఏర్పాటు ప్రకారం ఆంధ్ర అసెంబ్లీ సభ్యులకు రెండేళ్లు అదనపు గడువు అంటే 1962 వరకు ఇచ్చారు. 1952లో ఎన్నికైన హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలంగాణ సభ్యులకు యథావిధిగా, 1957లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా ద్విసభ్య నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఒక నియోజకవర్గంలో ఇద్దరు సభ్యులను ఎన్నుకునేవారు.

వారిలో ఒకరు జనరల్‌ కేటగిరి కాగా, మరొకరు రిజర్వుడ్‌ కేటగిరి. ఒక్కోసారి రెండు సీట్లకు రిజర్వుడ్‌ కేటగిరి వారే ఎన్నికైన సందర్భాలూ ఉన్నాయి. మక్తల్‌ ద్విసభ్య నియోజకవర్గంలో ఎన్నికైన ఇద్దరూ ఎస్‌సీ వర్గానికి చెందిన వారే. ఈ ఎన్నికలలో 68 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. 1952లో ఊపు మీదున్న పీడీఎఫ్‌ (కమ్యూనిస్టు పార్టీ) ప్రభావం ఈసారి తగ్గిపోయింది. 20 మందే ఈ పార్టీ నుంచి గెలిచారు. సామాజిక వర్గాల వారీగా విశ్లేషణ చూస్తే రెడ్ల ప్రభావం పెరిగింది. 1952లో ఉన్న బ్రాహ్మణ ఆధిక్యత గణనీయంగా తగ్గింది. వెలమలు పది మంది వరకు ఎన్నికయ్యారు. మొత్తం 30 మంది రెడ్లు ఎన్నికైతే కాంగ్రెస్‌ నుంచి 17, పీడీఎఫ్‌ నుంచి 8 మంది గెలిచారు. మరో ఐదుగురు ఇండిపెండెంట్లుగా గెలిచారు. గతసారి 26 మంది బ్రాహ్మణులు ఎన్నికైతే, 1957లో 18 మందే గెలిచారు. ఇంకా ముస్లింలు ఏడుగురు, బీసీలు ఆరుగురు గెలవగా, 22 మంది ఎస్సీలు విజయం సాధించారు. కమ్మ వర్గం వారు నలుగురు, వైశ్యులు, లింగాయత్‌లు ఇద్దరు చొప్పున గెలిచారు.

‘రెడ్డి ప్రాభవం’
తొలి ఎన్నిక (1952)ల కన్నా ఈసారి రెడ్డి సామాజికవర్గం నేతలు ఎక్కువ మంది శాసనసభకు ఎన్నికయ్యారు. 30 మంది ఎన్నిక కాగా, కాంగ్రెస్‌ నుంచి 17 మంది, పీడీఎఫ్‌ నుంచి 8 మంది ఉన్నారు. గతసారి పీడీఎఫ్, కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ పరిస్థితి ఉన్నా, 1957 నాటికి కమ్యూనిస్టుల ప్రభావం తగ్గింది. కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన రెడ్డి ప్రముఖులలో నూకల రామచంద్రారెడ్డి, డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి వంటి వారున్నారు. పీడీఎఫ్‌ నుంచి భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల కమలాదేవి తదితరులు ఉన్నారు. ఇండిపెండెంట్లుగా మరో ఐదుగురు ఎన్నికయ్యారు.

ముస్లిం, కమ్మ, వైశ్య..
1957 ఎన్నికల్లో ముస్లింలు ఏడుగురు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. మాసూనా బేగం, నవాబ్‌ జంగ్‌ వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ ఎన్నికల్లో నలుగురు విజయం సాధించగా, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, పీడీఎఫ్‌ నుంచి ఒకరు, ఇండిపెండెంట్‌గా ఒకరు గెలుపొందారు. ఇక, వైశ్య సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఇద్దరు ఎన్నికయ్యారు. ముషీరాబాద్‌ నుంచి సీతయ్య గుప్తా, కంటోన్మెంట్‌ నుంచి బీవీ గురుమూర్తి గెలుపొందారు. లింగాయత్‌ వర్గం నుంచి ఇద్దరు గెలుపొందారు.

తగ్గిన బీసీ వర్గం ఎమ్మెల్యేలు
వెనుకబడిన తరగతుల నుంచి ఈ ఎన్నికల్లో గెలిచిన వారి సంఖ్య గతంలో కన్నా తగ్గింది. కొండా లక్ష్మణ్‌ బాపూజీ (పద్మశాలి) ఈసారి నల్లగొండ జిల్లా చినకొండూరు నుంచి గెలుపొందారు. మొత్తంగా కాంగ్రెస్‌ నుంచి నలుగురు ఎన్నికయ్యారు. పీడీఎఫ్‌ నుంచి ధర్మభిక్షం (నకిరేకల్‌), ప్రజాపార్టీ తరఫున ఈ.చిన్నప్ప (మహబూబ్‌నగర్‌) గెలుపొందారు. 

ఎస్‌సీలు అత్యధికంగా కాంగ్రెస్‌ నుంచే..
ఎస్సీ ఎమ్మెల్యేలు అత్యధికంగా కాంగ్రెస్‌ నుంచి 15 మంది గెలుపొందారు. పీడీఎఫ్‌ నుంచి ముగ్గురు, సోషలిస్టు పార్టీ నుంచి ఇద్దరు, ఎస్‌సీఎఫ్, ఇండిపెండెంట్లుగా ఒక్కొక్కరు చొప్పున నెగ్గారు. ప్రముఖ నేత జి.వెంకటస్వామి ఈ ఎన్నికల్లోనే సిర్పూరు నుంచి గెలుపొందారు. అలాగే మహిళా దళిత నేత టి.ఎన్‌.సదాలక్ష్మితో పాటు కోదాటి రాజమల్లు, జేబీ ముత్యాలరావు, అరిగే రామస్వామి, సుమిత్రాదేవి వంటి ప్రముఖులు కూడా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ముగ్గురు జనరల్‌ స్థానాల నుంచి గెలుపొందారు. ఎస్‌టీ కేటగిరి నుంచి కాంగ్రెస్‌ తరఫున డి.నరసయ్య (ఇల్లెందు), కాశీరాం (ఆసిఫాబాద్‌) ఎన్నికయ్యారు. 

తగ్గిన బ్రాహ్మణ ఆధిక్యం
1952లో 26 మంది బ్రాహ్మణ నేతలు అసెంబ్లీకి ఎన్నికైతే.. 1957లో ఆ సంఖ్య 18కు తగ్గింది. వీరిలో అత్యధికంగా కాంగ్రెస్‌ నుంచి 13 మంది గెలుపొందగా, పీడీఎఫ్‌ నుంచి నలుగురు విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన ప్రముఖులలో పీవీ నరసింహారావు, హయగీవ్రాచారి, ముందుముల నరసింగరావు, ఎమ్‌.ఎస్‌.రాజలింగం తదితరులు ఉన్నారు. పీడీఎఫ్‌ నుంచి గెలిచిన వారిలో వెంకట కృష్ణ ప్రసాద్, కేఎల్‌ నరసింహారావు వంటి వారున్నారు. ఇండిపెండెంట్‌గా జుక్కల్‌ స్థానం నుంచి మాధవరావు గెలుపొందారు.

పెరిగిన వెలమల ప్రభావం
తొలి ఎన్నికలలో కంటే ఈసారి వెలమ సామాజిక వర్గం ప్రాతిని«ధ్యం మరింతగా పెరిగింది. 1957 ఎన్నికలలో మొత్తం పది మంది సభ్యులు అసెంబ్లీకి ఎన్నికైతే వారిలో ఆరుగురు కాంగ్రెస్‌ నుంచి, ముగ్గురు పీడీఎఫ్‌ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌ నుంచి జువ్వాది చొక్కారావు, జేవీ నరసింగరావు ప్రభృతులు ఉండగా, పీడీఎఫ్‌ నుంచి గెలిచిన ముఖ్యులలో చెన్నమనేని రాజేశ్వరరావు వంటి వారున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి జీవీ పీతాంబరరావు విజయం సాధించారు.
సామాజిక విశ్లేషణ
కొమ్మినేని శ్రీనివాసరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement