
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మరోమారు ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లను నిరాకరించారు. మూడున్నర ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజే పోలీసు భద్రతా విభాగం ఇద్దరు గన్‌మెన్లను ఆయనకు కేటాయించింది. తనకు అవసరం లేదంటూ అప్పట్లోనే జిల్లా ఎస్పీకి లేఖద్వారా తెలిపారు. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను అనుసరించి మరో రెండుసార్లు గన్‌మెన్లను ప్రభుత్వం కేటాయించగా తిప్పి పంపారు.
తాజాగా సోమవారం మళ్లీ ఇద్దరు గన్‌మెన్లను కేటాయించగా.. ఈసారీ వెనక్కి పంపారు. పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో భద్రత తప్పనిసరి అని, అందుకే పంపామని పోలీస్ అధికారులు ఎమ్మెల్యే కోటంరెడ్డికి స్పష్టం చేశారు. అయితే, తనకు ఎలాంటి భద్రత అవసరం లేదంటూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డీజీపీ, ఇంటిలిజెన్స్ డీజీ, జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. తనకు భద్రత వద్దని, పార్టీ కార్యకర్తలు, ప్రజలే తనకు కొండంత అండ అని తెలిపారు.