
సాక్షి, హైదరాబాద్: ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. తాము అన్ని విషయాలు మాట్లాడుకున్నామని, ఒక మంచి వాతావరణంలో చర్చించుకుని తామిద్దరమూ ఒక అవగాహన, ఆలోచనకు వచ్చామని కొత్తపల్లి మీడియాకు వెల్లడించారు. జగన్ చెప్పిన మాటలతో తాను 100 శాతం ఏకీభవించానన్నారు. ఈ నెల 28న జగన్ తమ జిల్లాలో పర్యటించనున్నందున అప్పుడు పార్టీలో చేరడమా.. లేక అంతకు ముందుగానే చేరడమా అనేది తర్వాత చెబుతాననని అన్నారు. మరోవైపు కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి కూడా ఆదివారం జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీకి కొంతకాలంగా దూరంగా ఉంటున్న తాను వి.విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిల ప్రోద్భలంతో ఇకపై క్రియాశీలకంగా పని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇదే విషయం జగన్‌కు తెలియజేశానన్నారు.
పార్టీలో చేరిన గిరిజన నేత శంకర్‌నాయక్
గిరిజన సంక్షేమ సంఘం నేత వడిత్యా శంకర్‌నాయక్ ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత ఐదేళ్ల చంద్రబాబునాయుడు పరిపాలనలో రాష్ట్రంలో గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలు అన్యాయమై పోయారని శంకర్‌నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మచిలీపట్నంకు చెందిన వైద్యురాలు, ఏపీసీసీ మాజీ కార్యదర్శి బల్లెం రాధికా మాధవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.
మాజీ ఎమ్మెల్యే దేవినేని చేరిక
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా రేపల్లె ఎన్నికల ప్రచార సభలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు ఆదివారం పార్టీలో చేరారు. రేపల్లె నియోజకవర్గంలోని రావిఅనంతవరం గ్రామం నుంచి వేలాది మందితో ర్యాలీగా వచ్చి, జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు టీడీపీ కౌన్సిలర్‌లు, పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు. వీరికి రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మోపిదేవి వెంకట రమణరావు పార్టీలోకి ఆహ్వానం పలికారు.