సింహం సింగిల్‌గానే వస్తుంది | KTR Criticize On Congress Leaders In Warangal | Sakshi
Sakshi News home page

సింహం సింగిల్‌గానే వస్తుంది

Published Sun, Nov 4 2018 12:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

KTR Criticize On Congress Leaders In Warangal - Sakshi

మహబూబాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన సభలో మాట్లాడుతున్న ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌

సింహం సింగిల్‌గానే వస్తుంది.. గుంపులుగా వచ్చేది ఏమిటో మీకు తెలుసని మహాకూటమిని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యంగా విమర్శించారు. మానుకోట పట్టణంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో, మరిపెడ మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ముసుగులో వస్తున్న చంద్రబాబు తెలంగాణలోని ప్రాజెక్టులను ఆపేందుకు చేసిన కుట్రలను ఎండగట్టారు. జిల్లాలో పెండింగ్‌ సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నారు.

సాక్షి, మహబూబాబాద్‌: సింహం సింగిల్‌గా వస్తుంది.. గుంపులుగా వచ్చేది ఏమిటో మీకు తెలుసని మహాకూటమిని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యంగా విమర్శించారు. మానుకోట పట్టణంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో, మరిపెడ మండల కేంద్రంలో శనివారం  ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌ సమస్యలు ఏమైనా ఉంటే  అధికారంలోకి రాగానే పరిష్కారిస్తామన్నారు. అధికారంలోకి రాగానే కేసముద్రంను  మునిసిపాలిటీగా, ఇనుగుర్తిని మండలం చేస్తామన్నారు. ఇంకా ఏమైనా తండాలు గ్రామపంచాయితీలుగా చేయాల్సి ఉంటే వాటిని జీపీలుగా చేస్తామన్నారు. మానుకోట గిరిజన బిడ్డల అస్తిత్వం, అకాంక్షల మేరకు మానుకోటను జిల్లా చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.

జనవరిలో జరగబోయే సర్పంచ్‌ ఎన్నికల్లో కొత్తగా 3,400 మంది గిరిజనులు సర్పంచ్‌లు కాబోతున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. డోర్నకల్‌ నియోజకవర్గంలో రెడ్యానాయక్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆరోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని జనసందోహాన్ని చూస్తేనే తేలిపోయిందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే మరిపెడలో 100 పడకల ఆస్పత్రి నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకవెళ్లి అమలయ్యేందుకు కృషి చేస్తానన్నారు. మరో 15 రోజుల వరకు ఎస్సారెస్పీ నీరు వదిలేలా  చూస్తామన్నారు.

 ప్రాజెక్టులు కట్టి సాగునీరందించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాటుపడుతుంటే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి ప్రాజెక్టులు నిలిపివేయాలని 30 ప్రేమలేఖలు పంపారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే డోర్నకల్‌కు సాగునీరు అందుతుందన్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. ఎవరు అడ్డుకున్నా రెండోసారి అధికారంలోకి రావడం, ప్రాజెక్టులు పూర్తి చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి ద్వారా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పి మహబూబాబాద్‌ జిల్లా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. పట్టాపాస్‌ పుస్తకాలు రానివారు ఎలాం టి  ఆపోహలకు గురికావొద్దని ఈ ఏడాది చివరి వరకు ప్రతి ఒక్కరికి పట్టాపాస్‌పుస్తకం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
 
గత పాలకులు గిరిజనులకు ఏం చేశారు: 

అజ్మీరా సీతారాంనాయక్, ఎంపీమహబూబాబాద్‌ జిల్లాలో గిరిజనులు అధికంగా ఉన్నారని, వారికి గత పాలకులు ఏం చేశారని ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ ప్రశ్నించారు. గిరిజనుల వలసలు, ఆత్మహత్యలు, పసిపిల్లల అమ్మకాలకు గత పాలకులే  కారణమన్నారు.
 
అభివృద్ధికి మారుపేరు కేసీఆర్‌: శంకర్‌నాయక్, తాజా మాజీ ఎమ్మెల్యే 
తెలంగాణ జన హృదయనేత, అభివృద్ధికి మారుపేరు సీఎం కేసీఆర్‌ అని మానుకోట తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. రైతులకు 24 గంటల కరెంట్‌ ఇచ్చిన ఏకైక ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచిందన్నారు. మల్యాల కేవీకేను హార్టికల్చర్‌ యూనివర్శిటీగా మార్చాలని సీఎంను కోరామన్నారు.

విలువలకు తిలోదకాలు ఇచ్చిన కాంగ్రెస్‌ : బండా ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు 
నైతిక విలువలంటే అర్థం తెలియని చంద్రబాబుతో జతకట్టి దిక్కుమాలిన కాంగ్రెస్‌ విలువలకు తిలోదకాలు ఇచ్చిందని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ విమర్శించారు. ప్రతిపక్షాలకు మంత్రి కేటీఆర్‌ సరైన సమాధానం ఇస్తున్నారని, వలవవాదుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. 

త్రివేణి సంగమంలా ఒక్కటయ్యారు: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 
రెడ్యానాయక్‌కు అడ్డం వస్తే జనప్రవాహంలో కొట్టుకపోతారని డిప్యేటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మరిపెడ సభలో ఆయన మాట్లాడుతూ విరోధులుగా ఉన్న నూకల నరేష్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, రెడ్యానాయక్‌తో కలవడంతో త్రివేణి సంగమంలా అనిపించిందన్నా రు. భద్రాచలం దగ్గర గోదారి ఉప్పొంగి రాములోరి పాదాలు కడిగినట్లుగా సభకు హాజరైన ప్రజలను చూస్తే అనిపించిందన్నారు.

 
సాగునీటిలో డోర్నకల్‌ వెనుకబాటు:  రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే 
అభివృద్ధిలో డోర్నకల్‌ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలకంటే ముందంజలో ఉందని, కానీ సాగునీటి విషయంలోనే మాత్రం కొంత వెనుకబాటు ఉందని ఎస్సారెస్పీ కాల్వల ద్వారా తమకు నీరు సరిపడా రాలేదని డోర్నకల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రెడ్యానాయక్‌ అన్నారు. మంత్రులు సాగునీటి విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని కోరారు.

ఐక్యంగా పనిచేస్తాం: సత్యవతి రాథోడ్‌ 
ఐకమత్యంగా కలిసి పనిచేసి కేసీఆర్‌కు కానుకగా రెడ్యానాయక్‌ను అసెంబ్లీకి పంపిస్తామని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యవతిరాథోడ్‌ అన్నారు. ఇన్ని రోజులు ప్రత్యర్థులుగా ఉన్న తాము కలిసికట్టుగా పనిచేసి గ్రామాల్లోని ప్రతి ఒక్క ఓటరును కలిసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రచారం చేస్తామన్నారు.

అత్యధిక మెజారిటీ లక్ష్యం: నరేష్‌ రెడ్డి 
అత్యధిక మెజారిటీ లక్ష్యంగా ప్రచారం చేయనున్న ట్లు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి అన్నారు. రెడ్యానాయక్‌ ఎపుడో గెలిచాడని లక్ష మెజార్టీ రావడం తేలిపోయిందన్నారు. సభలో టీఆర్‌ఎస్‌ ఢిల్లీ అధికార ప్రతినిధి రాంచంద్రునాయక్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాలోతు కవిత, జిల్లా గ్రం«థాలయ చైర్మెన్‌ గుడిపుడి నవీన్, డీఎస్‌ రవిచంద్ర, రామసహాయం సత్యనారాయణరెడ్డి, బాలమల్లు, ఓడీసీఎంఎస్‌ చైర్మెన్‌ నూకల వేణుగోపాల్‌రెడ్డి, కిషన్‌రావు, అడ్వకేటు వంటికొమ్ము అప్పారెడ్డి, జిల్లాలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. దాసరి ప్రసాద్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించగా గిద్దె రాంనర్సయ్య బృందం ఆలపించిన పాటలు సభికులను ఉర్రూ తలూగించాయి. మానుకోటకు చెందిన బోళ్ల రాకేష్‌రెడ్డి 500 మంది యువకులతో, గూడూరు మండలం తీగలవేణికి చెందిన న్యూడెమోక్రసీ నాయకుడు కోడి రవి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

మరిపెడలో నిర్వహించిన సభకు హాజరైన ప్రజలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement