సాక్షి, హైదారాబాద్ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 16 పార్లమెంట్ నియోజక వర్గాల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కేటీఆర్ పిలుపునిచ్చారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం11:50 నిమిషాలకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతారని పేర్కొన్నారు. కాగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత మొదటిసారిగా కేటీఆర్.. శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థాగత, సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.
వారి స్థానంలో కొత్త వారికి అవకాశం..
లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాల్లో భాగంగా... ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జనరల్ సెక్రటరీ, ముగ్గురు సెక్రటరీలు, ఎమ్మెల్యేలు ఇంచార్జీలుగా ఉంటారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓటర్ల లిస్ట్ అప్‌డేట్ చేయించడంతో పాటు...మార్చి నాటికి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. జనవరిలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ భవనాలు నిర్మించేందుకు సబ్ కమిటీలు నిర్మిస్తామని పేర్కొన్నారు.
ఇక పార్టీ కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యల గురించి చెప్పుకొనేందుకు వీలుగా తెలంగాణ భవన్‌లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్ (బీసీ సెల్ అధ్యక్షుడు- ముషీరాబాద్ ఎమ్మెల్యే), సుంకె రవి శంకర్ (ఎస్సీ సెల్ అధ్యక్షుడు- చొప్పదండి ఎమ్మెల్యే), మైనంపల్లి హన్మంతరావు (జనరల్ సెక్రటరీ- మల్కాజిగిరి ఎమ్మెల్యే), పట్నం నరేందర్ రెడ్డి (రాష్ట్ర కార్యదర్శి- కొడంగల్ ఎమ్మెల్యే), బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి(గద్వాల ఎమ్మెల్యే)లు రాష్ట్ర కార్యవర్గం నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారని పేర్కొన్నారు.వాళ్ల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment