సాధారణంగా మావోయిస్టులు, తిరుగుబాటు, వేర్పాటు ఉద్యమకారులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండదు. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టయిన ఎన్నికలను వారు బహిష్కరిస్తారు. ఎన్నికల్లో పాల్గొనవద్దని తమ పరిధిలోని ఓటర్లను బెదిరిస్తుంటారు కూడా. అయితే, మణిపూర్‌లోని వేర్పాటు ఉద్యమకారులైన కుకి నేషనల్ ఆర్మీ (కేఎన్‌ఏ) మాత్రం ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తోంది. అంతేకాదు, బీజేపీకి 90 శాతం కంటే తక్కువ ఓట్లు పడటానికి వీల్లేదని, తక్కువ పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని గ్రామ పెద్దలందరికీ వార్నింగ్ ఇచ్చింది. అంతటితో సరిపెట్టకుండా తమ ఆదేశాలు అమలవుతున్నాయో లేదో చూసే బాధ్యతను తమ దళంలోని 200 మంది మహిళలకు అప్పగించింది. వారు పోలింగ్ రోజున (ఏప్రిల్ 11) పోలింగ్ కేంద్రాల దగ్గర మాటు వేస్తారు. ఎవరైనా బీజేపీకి ఓటు వేయలేదని తెలిస్తే ఆడయినా మగైనా సరే ఊరుకోవద్దని వారికి నాయకత్వం స్పష్టంగా ఆదేశాలిచ్చింది.
అవసరమైతే కాల్పులు జరపడానికి కూడా వెనకాడవద్దని చెప్పింది. కేఎన్‌ఏ కమాండర్ తంగ్‌బోయి హవోకిప్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున హెచ్‌ఎస్ బెంజమిన్ మాటే పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మోరే ప్రాంతంలో ఇటీవల గ్రామ సర్పంచ్‌ల సమావేశం జరిగింది. దీనికి హాజరైన తంగ్‌బోయి సర్పంచ్‌లందరికీ హెచ్చరిక జారీ చేశారు. తమ గ్రామంలో బీజేపీకి 90 శాతానికి తక్కువ కాకుండా ఓట్లు పడేలా సర్పంచ్‌లు చూడాలని ఆదేశించారు. లేకపోతే ప్రజాకోర్టులో విచారించి, శిక్షిస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ రోజున మోరే ప్రాంతంలో ఉన్న 21 పోలింగ్ కేంద్రాల్లో తాను తిరుగుతానని, ఎక్కడైనా తన మాట పాటించకపోతే అక్కడికక్కడే చర్యలు తీసుకుంటానని తంగ్‌బోయి హెచ్చరించారు. 1988లో ఏర్పాటైన కుకి నేషనల్ ఆర్మీ మణిపూర్‌లో కుకిలు నివసించే ప్రాంతాలన్నింటినీ ఒకే పాలన కిందకి తేవాలని, లేదంటే కుకిలకు ప్రత్యేకంగా రెండు రాష్ట్రాలు(మయన్మార్‌లో ఒకటి, భారత్‌లో ఒకటి) ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment