సాక్షి, కాకినాడ: రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు లేదని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. సహజ మరణాలను కూడా రైతుల ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తూ... రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనాకాలంలో రుణమాఫీ హామీతో చంద్రబాబు రైతులను నిలువునా ముంచారని గత ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు తాము పరిహారం ఇచ్చామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలన చూసి ఓర్వలేకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని.. పొలాల్లోకి వెళ్లి రైతుల ధాన్యం కొనుగోలు చేసిన మొదటి ప్రభుత్వం తమదేనని కన్నబాబు వ్యాఖ్యానించారు.(ఆయిల్ పామ్ కంపెనీలపై కన్నబాబు అసంతృప్తి)
మంత్రి కన్నబాబు బుధవారమిక్కడ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వస్తేనే ఈ విషయం తెలుస్తుందని చురకలు అంటించారు. సినీ ప్రముఖులు సీఎం జగన్‌ను కలిసేందుకువస్తే..అమరావతి పేరుతో కొత్త డ్రామాలు వేయించారని.. అమరావతి పేరుతో రైతులను మోసం చేసిన చంద్రబాబును మాత్రం ప్రశ్నించరంటూ ఎల్లో మీడియా తీరుపై కన్నబాబు మండిపడ్డారు. ‘‘ఐదేళ్లలో చంద్రబాబు ఇచ్చిన రుణాలను సీఎం జగన్ ఒక్క ఏడాదిలో ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రభుత్వం తరఫున.. టమాటా, అరటి, కర్బూజ, జామ పంటలను ఎప్పుడైనా కొనుగోలు చేశారా’’ అని ప్రశ్నించారు. టమాటా నుంచి బూడిద గుమ్మడికాయ వరకు తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. చరిత్రలో తొలిసారి ప్రభుత్వమే విత్తన విక్రయాలు జరిపిందని పేర్కొన్నారు.(పేదోడి ఇంటిపైనా అబద్ధాలేనా?)
Comments
Please login to add a commentAdd a comment