3 సీట్లు..లాలూ పాట్లు | Lalu Prasad Yadav tactics from prison | Sakshi
Sakshi News home page

3 సీట్లు..లాలూ పాట్లు

Published Sat, Apr 20 2019 12:05 AM | Last Updated on Sat, Apr 20 2019 3:59 AM

Lalu Prasad Yadav tactics from prison - Sakshi

పెద్ద బిడ్డ  విజయానికి  జైలు నుంచే వ్యూహం
పాటలీపుత్రలో ఆర్జేడీ తరఫున పోటీచేసే అవకాశం 2014లో మీసాకు లభించింది. ఈ సీటు ఆశించిన పార్టీ సీనియర్‌ నేత రాంకృపాల్‌ యాదవ్‌ బీజేపీలో చేరారు. వెంటనే ఆయనకు పాటలీపుత్ర బీజేపీ టికెట్‌ కేటాయించారు. మీసాను రాంకృపాల్‌ 40 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. రెండేళ్ల తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. లాలూకు గతంలో సన్నిహిత అనుచరుడైన రాంకృపాల్‌ మళ్లీ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ సీటుకు మే 19న చివరి దశలో పోలింగ్‌ జరుగుతుంది. లాలూ జైల్లో ఉన్నందున ఆర్జేడీకి ఎన్నికల్లో నాయకత్వం వహిస్తున్న ఆయన రెండో కొడుకు, బిహార్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీతో అక్క మీసాకు మంచి సంబంధాలు లేవు. పెద్ద తమ్ముడు, మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌తోనే మీసాకు సాన్నిహిత్యం ఉంది. ‘మీసా దీదీ’ గెలుపు కోసం తేజ్‌ ప్రతాప్‌ అప్పుడే పాటలీపుత్రలో ప్రచారం ప్రారంభించారు. తనకున్న సామాజిక, ఇతర సంబంధాల ద్వారా మీసా విజయా నికి ఆయన గట్టి కృషి చేస్తున్నారు. 2014లో మాదిరిగా పాటలీపుత్రలో తన పూర్వ రాజకీయ శిష్యుని చేతిలో ‘పెద్ద బిడ్డ’ ఓడిపోకుండా మొదటి విజయం నమోదు చేయడానికి జైలు నుంచే లాలూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మీసా జంషెడ్‌పూర్‌ గాంధీ స్మారక వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివారు. 

రూడీపై  లాలూ వియ్యంకుని పోటీ..
2009 ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ విజయం సాధిం చిన సారణ్‌ నుంచి కాం గ్రెస్‌ మాజీ సీఎం కొడుకు, లాలూ వియ్యం కుడు, చంద్రికా రాయ్‌ ఆర్జేడీ తరఫున పోటీ చేస్తున్నారు. 2008 పునర్విభజనకు ముందు చాప్రా పేరుతో ఉన్న ఈ సీటు నుంచి లాలూ మూడు సార్లు గెలిచారు. సారణ్‌గా అవతరించాక లాలూ గెలిచినా 2013 కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించడంతో సభ్యత్వం కోల్పోయారు. 2014 ఎన్నికల్లో రబ్రీని బీజేపీ అభ్యర్థి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ 40 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ టికెట్‌ రూడీకే లభించింది. పర్సా ఆర్జేడీ ఎమ్మెల్యేగా 2015 ఎన్నికల్లో గెలిచిన చంద్రికా రాయ్‌కు టికెట్‌ ఇవ్వడాన్ని లాలూ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ వ్యతిరేకించారు. చంద్రికా కూతురు ఐశ్వర్యతో పెళ్లయిన ఆరు నెలలకే తేజ్‌ ప్రతాప్‌ విడాకులు కోరు తూ కోర్టుకెక్కారు. ఈ కారణంగా తన మామకు పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదంటూ ఆయన పట్టుబట్టినా లాలూ జోక్యంతో చంద్రికాకే టికెట్‌ దక్కింది. తన వియ్యంకుడిని లోక్‌సభకు గెలిపించి తన కొడుకు కాపురం నిలబెట్టడం లాలూ లక్ష్యం. చంద్రికా రాయ్‌ తండ్రి, మాజీ సీఎం దరోగాప్రసాద్‌ కుటుంబానికి ఈ ప్రాంతంలో మంచి పలుకుబడి ఉంది. బీజేపీ అభ్యర్థి రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. సారణ్‌ నియోజకవర్గంలో యాదవులు, రాజపుత్రుల జనాభా, ఆధిపత్యం ఎక్కువ. ఇక్కడ మే 6న ఆరో దశలో పోలింగ్‌ జరగనుంది. ఈసారి లాలూ భార్యకు బదులు ఆయన వియ్యంకుడితో తలపడుతున్న రూడీకి కూడా గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది.

మాజీ గురువు.. పూర్వ శత్రువు.. ప్రస్తుత మిత్రుడు
లాలూ పరువు ప్రతిష్టలకు పరీక్ష పెడుతున్న మూడో నియోజకవర్గం మాధేపురా. ఇక్కడ శరద్‌యాదవ్‌ ఆర్జేడీ గుర్తుపై మాధేపురా నుంచి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో జేడీయూలో ఉన్న శరద్‌ ఆ పార్టీ టికెట్‌పై పోటీచేసి ఆర్జేడీ అభ్యర్థి పప్పూ యాదవ్‌ చేతిలో ఓడిపోయారు. మాధేపురా నుంచి శరద్‌ నాలుగుసార్లు గెలుపొందారు. 1999లో లాలూను శరద్‌ ఓడించారు. 2015 ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ చేతులు కలపడంతో శరద్, లాలూ మళ్లీ దగ్గరయ్యారు. అయితే, 2017లో బిహార్‌ సీఎం, జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ బీజేపీకి దగ్గరవడంతో శరద్‌ ఆయనతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ కూటమిలో చేరారు. 1967 నుంచీ ఇక్కడ యాదవ నేతలే పార్లమెంటుకు ఎన్నికవుతున్నారు. నియోజకవర్గ జనాభాలో కూడా యాదవులే ఎక్కువ. ఈ కారణంగా ‘రోమ్‌ పోప్‌ కా, మాధేపురా గోప్‌ కా’ (రోమ్‌ పోప్‌దైతే మాధేపురా యాదవులది) అనే నానుడి ప్రచారంలో ఉంది. 2019 ఎన్నికల్లో శరద్‌ యాదవ్‌ ఆర్జేడీ కూటమి తరఫున రంగంలోకి దిగారు. ఆయనపై జేడీయూ తరఫున మాజీ ఎంపీ దినేశ్‌ చంద్ర యాదవ్, సిట్టింగ్‌ ఎంపీ రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ పప్పూ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. పప్పూ ఆర్జేడీ నుంచి వైదొలగి జన్‌ అధికార్‌ పార్టీ (లోక్‌తాంత్రిక్‌) తరఫున బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయడానికి పప్పూ చేసిన ప్రయత్నాలు లాలూ, తేజస్వీ ప్రతిఘటనతో బెడిసికొట్టాయి. పప్పూకు కూడా గతంలో లాలూ సన్నిహితునిగా ఉన్న నేపథ్యం ఉంది. ముగ్గురు ప్రధాన అభ్యర్థులూ యాదవులే కావడంతో ఆర్జేడీ టికెట్‌పై పోటీపడుతున్న శరద్‌ను గెలిపించడం లాలూకు ప్రతిష్టాత్మకంగా మారింది. మాధేపురాలో పోలింగ్‌ మూడో దశలో ఏప్రిల్‌ 23న జరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement