సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి, చట్టాలు మార్పు చేసి, అక్రమ సంపాదనను బయటకు తెస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. దీనిలో భాగంగానే ఆదాయపన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలు దాడులు చేస్తూ అక్రమ సంపాదనను వెలికితీస్తున్నాయని.. సీబీఐ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు తమ పని తాము చేసుకుంటున్నాయన్నారు. అలాంటి సంస్థలను రాష్ట్రంలోకి రాకూడదనడం పద్ధతి కాదన్నారు.
టీయూడబ్ల్యూజే యూనియన్ అధ్యక్షుడు విరాహత్ అలీ అధ్యక్షతన మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. దీనికి ఐజే యూ ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు లక్ష్మణ్ సమాధానమిచ్చారు. ‘పన్ను ఎగవేతదారులను వెనకేసుకొచ్చే పార్టీలు ఈ దేశంలో ఉన్నాయంటే దారుణం. పన్ను కట్టకుండా టీడీపీ వారు తప్పు చేస్తే వారిని వెనుకేసుకొస్తారు. సీబీఐ వంటి సంస్థలను ఎలా వద్దంటారు.. తప్పు చేసిన వారిపై దాడులు చేస్తే మంచిది కాదా.. ఇతర పార్టీల వారిపై దాడులు చేస్తే మంచిదా..’ అని ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
బాబు మాటలు ఎవరు నమ్మరు..
చంద్రబాబు చెప్పేవి ఎవరు నమ్మబోరని లక్ష్మణ్ చెప్పారు. పన్ను ఎగవేతదారులను వెనుకేసుకొస్తూ రాజకీయం చేస్తామనడం సరికాదన్నారు. తప్పు చేసి న టీడీపీ వారిని వెనుకేసుకురావడమే బాబు రాజకీయమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని, ఆయన చెప్పే మాటలు విని మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. తెలంగాణను శాసిం చాలనుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే బాబుకు బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్ర ప్రజలు తన చెప్పు చేతల్లో ఉండాలనుకునే ఫీట్లు ఇక చెల్లవన్నారు.
అది ఓ విఫల కూటమి
మహాకూటమి ఒక విఫల కూటమి అని, కాంగ్రెస్ చచ్చిన పాము వంటిదని లక్ష్మణ్ అన్నారు. ‘కూట మికి అమరావతి అడ్రస్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం బీజేపీనేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా రెండు, మూడ్రోజుల్లో తమ పీపుల్స్ మేనిఫెస్టో విడుదల చేస్తాం. హెదరాబాద్ కోసం ప్రత్యేక మేనిఫెస్టో, నియోజకవర్గానికో మేనిఫెస్టో ఉంటుంది. రైతుబంధు పథకానికి మేం వ్యతిరేకం కాదు.. కౌలు రైతులు, పోడు సాగు చేసుకునే గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదనే అడుగుతున్నాం’ అని చెప్పారు.
అది మీడియా సృష్టే..
బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు మధ్య అవగాహన అనేది మీడియా సృష్టేనని, అది చంద్రబాబు మైండ్‌గేమ్ అని లక్ష్మణ్ విమర్శించారు. ‘ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. కేంద్రం పథకాలతో ప్రజలకు చేరువయ్యాం, దానికితోడు మోదీ చరిష్మాతో గెలుపు తథ్యం. ఓటు బ్యాంకు లేని త్రిపుర, మణిపూర్, అసోం రాష్ట్రాల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అలాంటిది తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు. అధికారంలోకి వస్తే ఏటా లక్ష ఇళ్లు కడతాం. జాబితాలో పేరుండి ఇళ్లు రాకపోతే ఇళ్లు కట్టిచ్చే వరకు వారికి నెలకు రూ.5 వేల ఇంటి అద్దె చెల్లిస్తాం’ అని వ్యాఖ్యానించారు.
టీఆర్‌ఎస్‌ది కుటుంబపాలన..
టీఆర్‌ఎస్ పాలన కుటుంబ పాలనగా మారిందని లక్ష్మణ్ విమర్శించారు. ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇవ్వమని చెప్పిన కేసీఆర్ కుటుంబం నుంచి ప్రభుత్వంలో నలుగురు ఎందుకని ప్రశ్నిం చారు. ‘అధికారంలోకి వచ్చాక అమరులను విస్మరించారు. శ్రీకాంతాచారి, యాదిరెడ్డి కుటుంబాల కు న్యాయం జరగలేదు. నిరసన వ్యక్తం చేసిన రైతులకు బేడీలు వేశారు. నేరెళ్లలో దళితులపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్ల యింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment