సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను నవంబర్ మొదటివారంలో ఒకే విడతలో ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా తెలిపారు. ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు తుదిదశకు చేరుకున్నాయని, అలాగే అభ్యర్థుల ఎంపికపై క్షేత్రస్థాయిలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ చేపట్టిన అధ్యయనం ఈ నెలాఖరులో పూర్తవుతుందని అన్నారు. స్క్రీనింగ్ కమిటీ సంప్రదింపులు ముగిసిన ఒకటి, రెండు రోజుల అనంతరం నవంబర్ మొదటివారంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయా సామాజికవర్గాలకు న్యాయం జరిగేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలతో స్క్రీనింగ్ కమిటీ వరుస సమావేశాలు నిర్వహించి నేతల అభిప్రాయాలు సేకరించిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీసీలకు టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన సీట్ల కంటే అధికంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వనుందని తెలిపారు. ఈ నెల 27న పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఇంకా ఖరారు కాలేదన్నారు.
ఆరు రోజులపాటు ఆయన తెలంగాణలో పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఆ పర్యటనలో ఉదయం మేధావులు, విద్యార్థులు, కార్మికులు, ఆయా సామాజికవర్గాలతో రాహుల్ సమావేశమై మధ్యాహ్నం బహిరంగసభల్లో పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. టీఆర్‌ఎస్‌ను గద్దెదించి కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమని, దీని కోసం పొత్తుల్లో కొన్ని సీట్లు త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కుంతియా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment