సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ముగిసింది. 74 సీట్లలో పోటీ చేసే అభ్యర్ధులకు గురువారం సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఎన్నికల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా 26 సీట్లను భాగస్వామ్య పక్షాలకు కేటాయించామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఆర్సీ కుంతియా తెలిపారు.
టీడీపీకి 14 స్ధానాలు, టీజేఎస్‌కు 8 స్ధానాలు, సీపీఐకి మూడు స్దానాలు , తెలంగాణ ఇంటిపార్టీకి ఒక స్ధానం కేటాయించామని వెల్లడించారు. 74 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను శనివారం విడుదల చేస్తామని చెప్పారు.
ఈనెల11, 12న కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో చర్చించిన మీదట మిగిలిన స్దానాల్లో పార్టీ అభ్యర్ధులను ఖరారు చేస్తామని కుంతియా పేర్కొన్నారు. 74 స్ధానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తవగా, మరో 20 స్ధానాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈనెల 10న తొలిజాబితాను హైదరాబాద్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు.
వ్యూహాత్మక జాప్యం..
74 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ఈనెల 10న విడుదల చేయనున్న కాంగ్రెస్ పార్టీ మిగిలిన 20 స్థానాలపై వ్యూహాత్మకంగానే జాప్యం చేస్తోంది.రెబల్స్ బెడదను అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఎత్తుగడను అనుసరిస్తోంది. టికెట్ రాని నేతలకు ప్రత్యర్థి పార్టీలు గాలం వేయకుండా చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించనుంది. మరోవైపు గల్ఫ్ కార్మికులతో సమావేశమయ్యేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం రాత్రి దుబాయ్ బయలుదేరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment