సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కోలేకపోయిందన్న విమర్శలను ప్రతిపక్షనేత కె. జానారెడ్డి కొట్టిపారేశారు. తనతో మూకుమ్మడి రాజీనామా చేద్దామని కోమటిరెడ్డి అననేలేదని, ఒకవేళ అధిష్టానమే గనుక ఆదేశిస్తే అందరికంటే ముందు తానే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
(చదవండి: టీ సర్కార్‌కు కోమటిరెడ్డి డెడ్‌లైన్)
ఆ ముచ్చటే నాకు చెప్పలేదు: ‘‘మావాళ్లలోనే కొంతమంది ఒత్తిడితోనో, ఆవేదనతోనో నాయకత్వంపై ఆరోపణలు చేసిఉండొచ్చు. అందుకు ఎవరినీ తప్పుపట్టడంలేదు. సీఎల్పీ తరఫున చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలేమైనా ఉంటే తప్పకుండా పరిశీలిస్తాం. సభ్యత్వాల రద్దు విషయంలో ఇంకాస్త గట్టిగా ప్రతిస్పందించాల్సి వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అధిష్టానం సూచనల మేరకు ముందడుగు వేస్తాం. ప్రచారంలో ఉన్నట్లు రాజీనామాల అంశమేదీ మా మధ్య చర్చకు రాలేదు. ఒకవేళ అధిష్టానమే గనుక ఆ నిర్ణయం తీసుకుంటే, ముందు నేనే రాజీనామా చేస్తా. నిజానికి రాజీనామాల గురించి కోమటిరెడ్డి నాతో చెప్పనేలేదు. అలా చెప్పినట్లు ఎవరైనా అంటే.. ఆ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా. జానారెడ్డి ఎప్పుడైనా దేనికైనా రెడీగానే ఉంటాడని మరోసారి సవాల్ చేస్తున్నా. నాపైనగానీ, మరొకరిపైనగానీ ప్రతిసారి ఇలా మాట్లాడటం సరికాదు. ఈ కేసీఆర్ ప్రభుత్వపు కక్ష, అనైతికత, నిరంకుశత్వం అందరిపట్లా ఒకే విధంగా ఉంది. అందుకు నేను మినహాయింపు కాదు. వ్యక్తులను, పార్టీలను అణిచివేసేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ ప్రయత్నిస్తున్నది’’ అని జానా వివరించారు. (చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మళ్లీ ఊరట)
కోర్టు తీర్పుపై హర్షం: కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత తీర్పును సవాలు చేస్తూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంపై జానా హర్షం వ్యక్తం చేశారు. ‘‘మొన్న కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణలో కోర్టులు ఇచ్చిన తీర్పులు.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింతగా చాటాయి. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న కోర్టు గత తీర్పును అనుసరించాల్సిందిగా స్పీకర్‌ను విజ్ఞప్తి చేస్తున్నా. అసెంబ్లీ కార్యదర్శి కూడా చొరవతీసుకోవాలి. లేదంటే కోర్ట్ కంటెప్ట్‌కు వెళ్లాల్సి వస్తుంది’’ అని జానా పేర్కొన్నారు.
పంచాయితీ రాజ్ చట్టానికి నగుబాటు తప్పదు: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పంచాయితీరాజ్ చట్టానికి కూడా కోర్టులో ఎదురుదెబ్బ తగలడం ఖాయమని జనారెడ్డి అన్నారు. తక్షణమే అసెంబ్లీని లేదా అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటుచేసి పీఆర్ చట్టంపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘సర్కారు రూపొందించిన పంచాయితీ రాజ్ చట్టంలో చాలా లోపాలున్నాయి. ఇలాగే కోర్టుకు వెళితే ఎదురుదెబ్బ తప్పదు. కీలకమైన చట్టం కాబట్టి విపక్షాల సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అందుకోసం తక్షణమే ప్రభుత్వం ముందుకురావాలి’’ అని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు అయినా, కాకపోయినా ప్రాణహాని ఉన్నవారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని జానా గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment