ఢిల్లీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అన్షు ప్రకాశ్‌పై దాడి జరిగినట్లు డాక్టర్లు ఇచ్చిన నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అన్షు ప్రకాశ్‌పై దాడి నిజంగానే జరిగినట్లు నిర్ధారణ అయింది. దాడి కారణంగా ఆయన కింది పెదవి కమిలిపోయిందని, చెవుల లోపలి భాగంలో చీము కూడా వస్తుందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయనకు చికిత్స చేసిన వివరాలతో కూడిన ఒక పేజీ నివేదికను బహిరంగ పరిచారు. ఆయనకు మెడ భాగంలో కూడా కొంచెం దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. సోమవారం రాత్రి తనపై ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేశారని సీఎస్ అన్షు ప్రకాశ్ ఢిల్లీ ఉత్తర డీసీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
‘సోమవారం రాత్రి 8.45 గంటలకు సీఎం సలహాదారు నాకు ఫోన్ చేసి అర్ధరాత్రి సీఎం నివాసంలో సమావేశానికి హాజరుకావాలని చెప్పారు. అక్కడికి వెళ్లాక ప్రచార ప్రకటనలకు సంబంధించి వివరణ అడుగుతూనే నాపై ఎమ్మెల్యేలు అమానతుల్లా ఖాన్, ప్రకాశ్ జర్వాల్ దాడి చేశారు. అదృష్టం కొద్ది ఏదో ఒకలా తప్పించుకొని బయటపడ్డాను' అని ప్రకాశ్ చెప్పిన విషయం తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్‌కు కూడా ఆయన సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ దాడి కేసులో ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. అలాగే, దీనిపై స్పందించేందుకు సీఎం కేజ్రీవాల్ కూడా నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment