
సాక్షి. నాగర్‌కర్నూల్ : ఒకప్పుడు వలసలు, తీవ్ర కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎన్నికల యుద్ధం దాదాపు ఏకపక్షంగా మారింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉన్నా.. ప్రచారంలో మాత్రం ‘కారు’ దూసుకెళ్తోంది. ఇప్పటికే అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయగా, నియోజకవర్గ ఇన్‌చార్జి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. చేతిలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే జారుకోవడం, నేతల మధ్య సమన్వయ లోపంతో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోంది. బీజేపీ మాత్రం తన అస్తిత్వాన్ని కాపాడుకునే పనిలో పడింది. ప్రభుత్వ విజయాలు, వైఫల్యాలు ప్రచారాస్త్రాలైనా.. ప్రధానంగా సాగునీరు, రైల్వేలైన్, జోగుళాంబ ఆలయ అభివృద్ధి చుట్టూ ఇక్కడ రాజకీయం తిరుగుతోంది.
నాగర్‌కర్నూలు నియోజకవర్గం అంతా ఒకప్పుడు తీవ్ర కరువు కాటకాలు, వలసలకు పేరుగాంచింది. 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టాక కరువు నివారణ చర్యల్లో భాగంగా సాగునీటి వసతిని కల్పించేందుకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. వైఎస్ మరణానంతరం ఈ పనులు నెమ్మదించినా, అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ వేగిరం చేసింది.
ఈ నాలుగు ప్రాజెక్టుల కింద మొత్తంగా 8.77 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉండగా, ఇప్పటికే 6.03 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. ఇందులో ఒక్క కల్వకుర్తి కిందే 3.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. ఈ ప్రాజెక్టు కింద 700కు పైగా చెరువులను నింపారు. సాగుకు నీరందడంతో ఈ ప్రాంతంలో వలసలు ఆగాయి. దీనికి తోడు కొత్తగా పాలమూరు–రంగారెడ్డి ద్వారా పూర్వ పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా పనులు జరుగుతున్నాయి.
ఇవి పూర్తయితే నాగర్‌కర్నూలు పరిధిలోని ప్రాంతాలన్నీ సస్యశ్యామలమవుతాయి. అదే జరిగితే వలసలకు అడ్డుకట్ట పడినట్టేనని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ఇంకా భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, కాల్వల పనులు పూర్తి, ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ వంటి పనులు చేపట్టాల్సి ఉంది.
జోగుళాంబ.. రైల్వేలైన్..గట్టు..
ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పలు కీలకాంశాల చుట్టూ అన్ని పార్టీలు ప్రదక్షిణం చేస్తున్నాయి. ముఖ్యంగా నాలుగు దశాబ్దాలుగా గద్వాల–మాచర్ల రైల్వేలైన్ నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ ప్రజలను ఇదిగో అదిగో అంటూ ఊరిస్తోంది. ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ప్రధానాంశంగా మారింది. పోటీ చేసే ప్రతి నాయకుడు రైల్వేలైన్‌ను సాధిస్తామని చెబుతున్నా.. సాధ్యం కాలేదు. గద్వాల–మాచర్ల రైల్వేలైన్ కోసం 1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, ఇప్పటికీ పనులు కొలిక్కి రాలేదు.
- గట్టు ఎత్తిపోతల పథకం, చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు చేపడితే గద్వాల నియోజకవర్గంలోని గట్టు, ధరూర్, కేటిదొడ్డి మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనలు మళ్లీ మారడంతో ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సమయం పట్టేలా ఉంది.
- అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఐదవ శక్తిపీఠం జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇక్కడ సరైన రవాణా వసతులు లేవు. ఆలయ అభివృధ్ధికి పురావస్తు శాఖ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
- చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న గద్వాల జిల్లాకు చేనేత పార్కు మంజూరైంది. అయితే, పనులు మొదలు కావాల్సి ఉంది. అచ్చంపేట నియోజకవర్గంలో కాగితపు పరిశ్రమ ఏర్పాటు, కొల్లాపూర్ నియోజకవర్గంలో సోమశిల బ్రిడ్జి నిర్మాణం, శ్రీశైలం ముంపు నిర్వాసితులకు సంబంధించి 98 జీఓ అమలు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి.
లోక్‌సభ ఓటర్లు
పురుషులు 7,99,182
మహిళలు 7,89,529
ఇతరులు 35
మొత్తం 15,88,746
నాగర్‌కర్నూలు లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లు
గద్వాల, అలంపూర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి
రేసులో ముందున్న ‘కారు’
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరింట టీఆర్‌ఎస్ గెలిచింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మొత్తంగా 2 లక్షల మెజారిటీ వచ్చింది. ఆ పార్టీకి 6,36,002 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 4,44,084 ఓట్లు వచ్చాయి. అయితే 2004 నుంచి ఈ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్ గెలవలేదు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య టీఆర్‌ఎస్ అభ్యర్థిపై 17,800 ఓట్లతో గెలిచారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాగర్‌కర్నూలులో ఎట్టి పరిస్థితుల్లోనూ పాగా వేయాలని పట్టుదలతో ఉన్న టీఆర్‌ఎస్ అన్ని పార్టీల కన్నా ముందే కదన రంగంలోకి దిగింది.
ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సభ పేరుతో వనపర్తి సభకు హాజరయ్యారు. శాసనసభ ఎన్నికల్లో ఈ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 51 శాతం ఓట్లు వచ్చిన దృష్ట్యా, ఈసారి ఎలాగైనా 4 లక్షల ఓట్ల మెజార్టీతో పార్టీ అభ్యర్థి పి.రాములును గెలిపించి కేసీఆర్‌కు బహుమానంగా ఇద్దామంటూ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో పాటే కొల్లాపూర్ నియోజకవర్గం నంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ బలం మరింత పెరిగింది.
అనంతరం గత నెల 31న వనపర్తిలో సీఎం కేసీఆర్ సభ విజయవంతం కావడంతో పార్టీలో మరింత జోష్ పెరిగింది. సర్పంచ్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ మద్దతుదారులు ప్రతి నియోజకవర్గంలో వంద స్థానాలకు పైగా కైవసం చేసుకోవడం పార్టీకి కలిసొస్తోంది. ఇతర పార్టీల నుంచి గెలిచిన సర్పంచ్‌లు, ముఖ్య నేతలు పార్టీలో చేరుతుండటం ఊపునిస్తోంది. కల్వకుర్తి సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచడం, దీని ద్వారా 400కు పైగా చెరువులను నింపడం, శ్రీశైలం నిర్వాసితులను ఆదుకుంటామని, సిధ్ధేశ్వరం బ్రిడ్జి నిర్మించి తీరుతామని చేసిన వాగ్దానాలు కలిసొస్తున్నాయి.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో 20 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరిస్తామన్న సీఎం హామీ సైతం ఇక్కడ బాగా పనిచేస్తోం ది. ‘ఎన్నికల తర్వాత ఇక్కడికొచ్చి మూడు రోజులు ఉంటా.. అన్ని సమస్యలు ప్రజా దర్బార్‌లో పెట్టి పరిష్కరించుకుందాం’ అని సీఎం కేసీఆర్ వనపర్తి సభలో ప్రకటించడం ఇక్కడ ప్రజలను ప్రభావితం చేస్తోంది. పోటీలో ఉన్న పి.రాములుకు సౌమ్యుడనే పేరుండటం, ఆయనకు మాజీ ఎంపీ మందా జగన్నాథం నుంచి సహకారం అందుతుండటంతో విజయవకాశాలు మెరుగయ్యాయి.
పై‘చేయి’ కష్టమే..
ఈ నియోజకవర్గంలో తొలి నుంచి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తోంది. 2009, 2014 ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఇక్కడ గెలుపొందారు. మొత్తంగా ఈ స్థానానికి 12సార్లు ఎన్నికలు జరగ్గా ఏడుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి టీపీఎస్ గెలుపొందాయి. ఇందులో 1980–84, 1989–91 మధ్య కాలంలో మల్లు అనంతరాములు, 1991–96, 1998–99 మధ్యకాలంలో మల్లు రవి ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం మళ్లీ మల్లు రవి పోటీలో ఉన్నారు.
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. లోక్‌సభ నియోజకవర్గంపై పట్టు ఉండటం, సీనియర్ నేత కావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకే ఈ టికెట్ కేటాయించింది. ప్రస్తుతం పార్టీ నుంచి జరుగుతున్న ఫిరాయింపులు ఆయనకు ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొల్లాపూర్–సిద్ధేశ్వరం వంతెన, శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇవ్వడంతోనే ఆయన కాంగ్రెస్‌ను వీడినట్లు ప్రకటించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్‌దాస్ సైతం పార్టీని వీడారు. గత ఎన్నికల్లో నంది ఎల్లయ్య గెలుపులో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో చేరి మహబూబ్‌నగర్ పార్లమెంట్ బరిలో నిలిచారు.
ఇదే పార్లమెంట్ పరిధిలోని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సైతం కాంగ్రెస్ నుంచి మహబూబ్‌నగర్ పోటీలో ఉన్నారు. దీంతో మల్లు రవికి కీలక నేతల సహాయం కొరవడింది. సీనియర్ నేత చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌పైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. గట్టు ఎత్తిపోతల చేపట్టకపోవడం, తుమ్మిళ్ల రెండో ఫేజ్, కల్వకుర్తి, నెట్టెంపాడు పనుల పూర్తిలో విఫలం వంటి అంశాలను మల్లు రవి తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
జడ్చర్ల–మాచర్ల రైల్వేలైన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్లే పనులు ముందుకు సాగడం లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల వనపర్తిలో రాహుల్‌గాంధీ బహిరంగసభ సక్సెస్ కావడం కాంగ్రెస్‌లో సంతోషాన్ని నింపింది.
‘కమల’ వికాసం ఎంత?
బీజేపీ తరఫున పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శ్రుతి పోటీలో ఉన్నారు. 2006 నుంచి పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా సేవలందిస్తున్న ఆమె ప్రస్తుతం బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆమె తన విజయానికి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. అయితే కల్వకుర్తి పరిధిలో తప్ప మరెక్కడా ఆమెకు చెప్పుకోదగ్గ బలం లేదు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆచారికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చాయి.
అక్కడ మినహా బీజేపీ ఎక్కడా బలంగా లేదు. కొంతమేర వనపర్తిలో మాత్రం పార్టీకి పట్టున్న నేతలున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ అస్తిత్వాన్ని కాపాడేందుకు శ్రుతి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. దేశ సమగ్రత విషయంలో ప్రధాని నరేంద్రమోదీ సేవలు, అవినీతి నిర్మూలన, సర్జికల్ స్ట్రయిక్స్, స్కిల్ ఇండియా వంటి వాటిని ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభ విజయవంతం కావడం, శక్తిమేర బీజేపీ శ్రేణులు కలిసిమెలిసి పనిచేయడం కొంత సానుకూలంగా ఉన్నాయి. నాగర్‌కర్నూలుæ పార్లమెంట్ నియోజకవర్గంలో వీలైనంత ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తానంటూ ఆమె చేస్తున్న ప్రచారం యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment