కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే (ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు : ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ ఉత్కంఠ భరితంగా కొనసాగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ముగిసిన సంగతి తెలిసిందే. పోలింగ్ అనంతరం ఆదివారం తన స్వగృహంలో మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే దళిత నేత కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ అధిష్టానం దళిత వ్యక్తిని సీఎంగా నియమిస్తానంటే తప్పక ఒప్పుకుంటానని, నేనెవరికీ వ్యతిరేకం కాదని పేర్కొన్న సిద్ధరామయ్య ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బలవంతంగా ఎవరినీ సీఎం చేయడం కుదరదన్న ఆయన.. అలా జరిగిన పక్షంలో ప్రభుత్వాన్ని నడిపించడం కష్టమవుతుందంటూ వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడతాయన్న ఖర్గే మాట్లాడుతూ.. దళిత సీఎం అంశంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. తమ మధ్య(కాంగ్రెస్ పార్టీ సభ్యుల) విభేదాలు సృష్టించడమే వారి లక్ష్యంగా కన్పిస్తోందంటూ ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలో అధిష్టానమే నిర్ణయిస్తుందని ఖర్గే స్పష్టం చేశారు.
సామాజిక వర్గం కాదు.. సీనియార్టీని చూడండి
సామాజిక వర్గం ఆధారంగా ముఖ్యమంత్రి పదవి లేదా ప్రతిపక్ష నేత పదవి ఇవ్వడం తనకు సంతోషాన్ని కలిగించదని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. తన సీనియార్టీ, పార్టీకి చేసిన సేవలను గుర్తించి పదవి ఇస్తే స్వీకరించడానికి అభ్యంతరం లేదంటూ మనసులోని మాట బయటపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment