
గోదావరిఖనిలో మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న సీఎల్పీ నేత భట్టి, తదితరులు
మంథని/గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్య మృతిపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంథనిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులు హింసించడం వల్లే రంగయ్య చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతుంటే.. పోలీసులు మాత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దళితుల ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఖననం చేయకుండా దహనం ఎందుకు చేయించారని భట్టి ప్రశ్నించారు.
రంగయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు అవసరమైతే రాజ్యాంగ వ్యవస్థలోని అన్ని తలుపులను తడుతామని, రాష్ట్రపతి, గవర్నర్, రాష్ట్ర, జాతీయ హక్కుల కమిషన్‌లను కలుస్తామని ఆయన వివరించారు. మంథని ఘటనపై ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని, సిరిసిల్లలోని నేరెళ్ల, పెద్దపల్లిలోని బొంపెల్లి ఘటనలపై విచారణ జరిపించి.. నివేదికలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధైర్యంగా తలెత్తుకొని బతకొచ్చని ఆశించి తెలంగాణ తెచ్చుకుంటే.. ఆరేళ్లలో ఏ ఒక్క వర్గం అలా ముందుకెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశించిన తెలంగాణ కోసం మరోమారు గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రంగయ్య మృతిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు.
రూ.కోటి పరిహారం ఇవ్వాలి
సింగరేణి మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని భట్టి, శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.ఓసీపీ–1 బ్లాస్టింగ్‌లో మృతి చెందిన కార్మిక కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment