
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రం ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘వాళ్లు(కాంగ్రెస్ పార్టీ) యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్(మన్మోహన్ సింగ్)ని అడ్డుపెట్టుకుని ఎలాంటి పనులు చేశారో ఈ సినిమా చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి వైఖరి నాకు నచ్చకపోవడం వల్లనే నేను పార్టీ నుంచి బయటకు వచ్చి తృణముల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాను. మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాను’ అని తెలిపారు.
ఈ సందర్భంగా మమతా మోదీ గురించి కూడా పరోక్ష విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే డ్రామా విడుదలయ్యింది. ఇక ఎన్నికలయ్యాక ‘ది డిజాస్టరస్ ప్రైమ్ మినిస్టర్’ అనే డ్రామా చూస్తారంటూ మోదీ గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఊరుకోక వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. ‘ఒకసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొండి.. జనాలతో సరిగా మాట్లాడగలనా... కనీసం వారిని చూసి నవ్వగలనా అంటూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొండి. జనాలు మిమ్మల్ని చూసి అరే బాబ.. గబ్బర్ సింగ్ వస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నార’ని మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు మమతా.