
మాల్దా: ప్రధాని∙మోదీతోపాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలకిచ్చిన హామీల అమల్లో విఫలమయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. శనివారం మాల్దా(ఉత్తర) లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్ మాట్లాడారు. ‘మమతా బెనర్జీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు. గత కమ్యూనిస్టుల పాలనకు టీఎంసీ పాలనకు తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలో మార్పేమీ లేదు. ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. మమత పాలన అధ్వానం. ఆమెకు మినహా మరొకరు బహిరంగంగా మాట్లాడేందుకు అవకాశం లేదు. ప్రజలకిచ్చిన హామీల అమలులో మమత విఫలమయ్యారు’ అంటూ విమర్శించారు. అనంతరం ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
‘ధనవంతుల ఇళ్లకే కాపలాదార్లు(చౌకీదార్లు) ఉంటారు. రైతులు, నిరుపేదలకు వారి అవసరం ఉండదు. ఆర్థిక నేరగాళ్లయిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్‌మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లకు ఈయన చౌకీదార్’ అంటూ ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడూ అబద్ధాలే చెబుతుంటారు. ఎక్కడికి వెళ్లినా అబద్ధాలే. దేశాన్ని ఐక్యంగా ఉంచాలనుకునే కాంగ్రెస్‌కు, కుల, మత, భాషా భేదాలతో దేశాన్ని విభజించాలనుకునే బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్యే ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ’ అని పేర్కొన్నారు. ‘దేశానికి కాపలాదారుగా ఉంటానంటూ 2014 ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన మోదీ.. ప్రజలకు అడ్డంగా దొరికిపోయేసరికి జాతీయవాదం గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ చౌకీదారేనంటూ మాట మారుస్తున్నారు’ అని ఆరోపించారు.