
సాక్షి, విజయవాడ : తెలుగు దేశం పార్టీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్ చేతుల నుంచి బలవంతంగా లాక్కున్నాడని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత మంచు మోహన్ బాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎదుటి వారు బాగుంటే చంద్రబాబు ఓర్వలేరని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైఎస్ జగన్‌ని దొంగ అనటం తప్ప చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ఎం చేశారో ఇప్పటికైనా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే రీతిలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారని విమర్శించారు. చంద్రబాబుకు అసలు క్యారెక్టర్ లేదన్నారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు అన్ని కేసుల్లోనూ స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు దోచుకోవడానికి ఇసుకను కూడా వదల్లేదని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అమాయకులని.. వారిని బాబు మోసం చేశారని మోహన్ బాబు ఆరోపించారు.
చంద్రబాబుది కుటుంబ పాలన
చంద్రబాబు నాయుడు కుటుంబ పాలన సాగిస్తున్నారని మోహన్‌బాబు విమర్శించారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీలో కుటుంబం సభ్యులను రానిచ్చేవాడుకాదన్నారు. కానీ చంద్రబాబు తన కుటుంబ సభ్యులకు మాత్రమే కీలక పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీకి ఎంతో సేవ చేసిన హరికృష్ణకు చంద్రబాబు ఏం చేశారో ఇప్పటికైనా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కోసం టీడీపీలో ఎవరూ పనిచేయడం లేదని.. ఎన్టీఆర్‌పై అభిమానంతోనే పార్టీలో కొనసాగుతున్నారని ఆయన చెప్పారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని మోసాలు అయిన చేస్తాడని ఆరోపించారు. పసుపు కుంకుమ పేరుతో మీ డబ్బే మీకు ఇస్తున్నారని ప్రజలు ఎవరూ చంద్రబాబును నమ్మోద్దని కోరారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ఏపీ ప్రజలను మోహన్‌బాబు కోరారు.