
మాట్లాడుతున్న మర్రి రాజశేఖర్‌రెడ్డి
కంటోన్మెంట్: లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఓటర్లు అభివృద్ధికే పట్టం కట్టాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. అపోహలు సృష్టిస్తూ, అబద్ధాలను ప్రచారం చేసే ప్రత్యర్థుల మాటల నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. బోయిన్‌పల్లి సౌజన్యకాలనీలోని తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి తనకు అపూర్వ స్పందన లభించిందన్నారు. ముఖ్యంగా ఎక్కడికెళ్లినా కేసీఆర్ పథకాలతో సంతృప్తిగా ఉన్నామని ప్రజలు చెబుతూ ఉండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకుగానూ ఆరుగురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రత్యర్థులకంటే 3.50 లక్షల పైచిలుకు మెజార్టీ సాధించారన్నారు.
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుండటంతో పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా నాలుగు లక్షలకు పైగా మెజారిటీ సాధిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, కంటోన్మెంట్ బోర్డు సభ్యులంతా టీఆర్‌ఎస్‌కు చెందిన వారే కావడం తనకు కలిసొస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు తన వ్యక్తిత్వంపై దాడికి యత్నించడం బాధాకరమన్నారు. తన కుటుంబ ఆధ్వర్యంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారని, 10వేల మందికి పైగా సిబ్బంది ఉన్నారని అన్నారు. వారందరితో తాము కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి కాలేజీలో జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు. ఈ క్రమంలో తాను విద్యార్థులతో డ్యాన్స్ చేసే ఫొటోలను కొందరు సొషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ఆయా విద్యార్థులు, వారి కుటుంబాలు బాధపడేలా చేయకూడదన్నారు. వదంతులు నమ్మొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment