లక్నో : 30 ఏళ్ల బీజేపీ కంచుకోటని ఎస్పీ-బీఎస్పీ కూటమి బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్, పుల్పూర్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీని ఘోరంగా దెబ్బతీస్తూ.. ఎస్పీ-బీఎస్పీ కూటమిలు విజయ భావుటా ఎగరవేశాయి. ఈ ఫలితాల ప్రకటన వెలువడిన తర్వాత బీఎస్పీ అధినేత మాయవతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో గంటపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం కోసం అఖిలేష్‌ను తీసుకు రావడానికి మాయవతి మెర్సిడెస్‌ను పంపినట్టు తెలిసింది. మెర్సిడెస్ పంపించి మరీ అఖిలేష్ యాదవ్‌ను తన ఇంటికి తీసుకొచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
గోరఖ్‌పూర్, పుల్పూర్ ఉపఎన్నికల్లో గెలిచిన అనంతరం, అఖిలేష్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం ఆయన తన ఇంటికి వెళ్లిపోయారు. అఖిలేష్ తన ఇంటికి వెళ్లిన అనంతరం, ఓ సీనియర్ బీఎస్పీ లీడరు నుంచి ఆయనకు ఫోన్ చేసి అభినందించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో మాయవతికి ఫోన్ చేయాలని సీనియర్ బీఎస్పీ లీడరు, అఖిలేష్‌ను అభ్యర్థించారని.. ఆయన అభ్యర్థన మేరకు అఖిలేష్, బీఎస్పీ బాస్‌తో మాట్లాడారని, తదుపరి పరిణామాలపై చర్చించాలని ఆశిస్తున్నట్టు కోరారని తెలిపాయి. అఖిలేష్ అభ్యర్థన మేరకు బీఎస్పీ బాస్, ఆయన తీసుకురావడానికి తన ప్రతినిధితో కూడిన మెర్సిడెస్ కారును, అఖిలేష్ ఇంటికి పంపించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కిలోమీటర్ దూరంలో ఉన్న విక్రమాదిత్య మార్గ్ నుంచి మాల్ అవెన్యూ బరేలీలో ఉన్న మాయవతి ఇంటికి అఖిలేష్ ఆ కారులోనే వెళ్లినట్టు పేర్కొన్నాయి. మాయవతి, అఖిలేష్ సమావేశానికి బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్‌సీ మిశ్రా, బీఎస్పీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్‌లు కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. అయితే ఎస్పీ, బీఎస్పీ అధినేతలు ఏం మాట్లాడుకున్నారన్నది తెలియరాలేదు. గంట పాటు మాయవతితో సమావేశమైన అఖిలేష్, మీడియా ముందు ఏం స్పందించకుండానే ఇంటికి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment